Home / Telugu News / శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?

శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?

జమ్మిచెట్టు. దసరా వచ్చిందంటే చాలు సోషల్‌ మీడియాలో పుంఖానుపుంఖాలుగా జమ్మిచెట్లు గురించి పురాణ కథలు వచ్చి పడుతుంటాయి. అంతమాత్రాన అవి పుక్కిటి పురాణాలు ఎంతమాత్రం కావు. ఎందుకంటే శాస్త్రీయతను దైవానికి జోడిస్తేనే ప్రకృతిని కాపాడుకోగలమని మన పూర్వీకులు అప్పట్లోనే గుర్తించి.. ప్రతి పండుగకు ఒక చెట్టు.. ఒక జంతువు.. ఇలా ఏదో విధంగా మనిషిని ప్రకృతిలో మమేకమయ్యేలా ఏర్పాటు చేశారు. సైంటిఫిక్‌గా చూసినా మన పూర్వీకులు చెప్పిన ప్రతిదాన్లోనూ ఎక్కడో ఒక చోట అంతర్లీనంగా విస్త్రుత మానవాళి ప్రయోజనం దాగి ఉంటుంది. అందుకే ప్రతి పండుగ, పూజలు, నియమ నిష్టలు ఇత్యాది అంశాలను లోతుగా పరిశీలిస్తే ఎంతో ఆసక్తి కరమైన విషయాలు వెలుగుచూస్తుంటాయి. ముఖ్యంగా అవగాహన ఉన్నవాళ్లు వీటిని ఎప్పటికప్పుడు ప్రజెంట్ జనరేషన్‌కు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ‘న్యూస్‌18 తెలుగు’ ఈ ప్రయత్నం చేస్తోంది.

నవరాత్రులుగా జరుపుకునే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే. ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి. జమ్మి మనకు అంటే భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లోనూ.. ఇప్పటికీ యజ్ఝయాగాదులకు ఈ చెట్టు కాండాన్నే అగ్నిని పుట్టించడానికి యాజ్ణికులు చిలుకుతుంటారు. వెన్నకోసం మజ్జిగను చిలికినట్టే.. అగ్ని కోసం కట్టెను సాధనంగా వాడడం మన మూలాలను ఒకసారి వెనక్కు తిరిగి చూసుకున్నట్టే నన్నది ఇక్కడ భావన.. మహారణ్యాల్లో శతాబ్దాల తరబడి పెరిగి పెనవేసుకున్న చెట్లకొమ్మల మధ్య రాపిడి ద్వారానే అగ్ని పుట్టిందని మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ పూజలు, క్రతువుల్లోనూ శాస్త్రీయతను మనం వదిలేయడంలేదనే కదా..? మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువ ఉండే అనేక ప్రాంతాలలోనూ ప్రజలకు జమ్మి తరాలుగా తెలిసిందే. రాలే ఆకులు రాలుతుంటే వచ్చేది వస్తుంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోవడం మనం చూడలేం. ఇలాంటి ప్రత్యేక లక్షణాలుండే రకాల్లో ఇది ఒకటి. ఇక పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి; దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.

జమ్మిచెట్టు
ఇప్పటికీ పల్లెల్లో చెడు దరిచేరకుండా ఇంటి ప్రహరీ గోడలపై, వాకిళ్లపై జమ్మి కాండాలు ఉంచడం ప్రజల నమ్మకం. రైతులు తమ పశుపక్ష్యాదుల ఆరోగ్యం కోసం జమ్మిని పూజిస్తుంటారు. అజ్ఞాతవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది అని చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూపంగా (శక్తిగా) భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట.

అవును జమ్మి బంగారమే.. పూజ ముగిసిన అనంతరం చెట్టు నుంచి జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భావిస్తూ భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి కోరికలు నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.

పాలపిట్ట
దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ… అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ బయల్దేరింది.

జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ (UAE) భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే. పురాణాల్లో ప్రస్తావించిన జమ్మిచెట్టు, పాలపిట్ట లాంటి వాటి ప్రాధాన్యాన్ని ఇప్పటి తరానికి శాస్త్రీయంగా వివరించి వాటి సంరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని పెద్దలు చెబుతుంటారు. అమ్మవారి దేవాలయాల్లో ఈ చెట్టు లేకుండా ఉండదు. ఇప్పటి జనరేషనకు వీటిని చూపించి ప్రకృతి విలువను తెలియజెప్పాల్సిన అవసరం ఉంది.

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top