Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్… హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్

ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్… హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్


ఒక్క ఉంగరంలో ఎన్ని డైమండ్స్ ఉంటాయి? ఓ 100 వరకు ఉండొచ్చు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఏకంగా ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్ పొదగడం విశేషం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్… ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’ పేరుతో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. అరుదైన పుష్పం బ్రహ్మ కమలాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన ఈ డైమండ్ రింగ్‌ను గత నెలలోనే ఆవిష్కరించారు. గత ఏడాది గిన్నీస్ వాల్డ్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని సబ్మిట్ చేశారు. అనేక రౌండ్లు వెరిఫికేషన్ ప్రక్రియ జరిపారు. ఒక రింగులో ఎక్కువ డైమండ్స్ పొదిగిన గిన్నీస్ రికార్డ్ ఈ ఉంగరానికి దక్కింది. ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వాల్డ్ రికార్డ్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ ఉంగరం తయారీకి పడ్డ శ్రమ ఎంతో ఆ వీడియోలో తెలుస్తుంది. ఆ వీడియో ఇదే.

గిన్నీస్ వాల్డ్ రికార్డ్స్ సొంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్. ఇలాంటి యూనిక్ పీస్ తయారుచేయాలన్న తన అభిరుచిని గుర్తించారని అన్నారు. మొదట ఈ ఉంగరాన్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్‌ను 2018 సెప్టెంబర్‌లో రూపొందించారు. అప్పుడు అది కేవలం పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే. కేవలం ప్లానింగ్‌కే 45 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత ఉంగరం తయారు చేసే పని మొదలుపెట్టారు. 2019 మార్చి నాటికి రింగ్ బేస్ తయారైంది. 2019 ఆగస్ట్ నాటికి రింగ్ తయారైంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ పని మొదలైంది. ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 11 నెలల సమయం పట్టింది. ఈ ఉంగరం ఆరు లేయర్స్‌తో ఉంటుంది. ప్రతీ లేయర్‌లో 8 రేకులు ఉంటాయి. మొత్తం ఉంగరంలో 7801 వజ్రాలున్నాయి.