డ్రగ్స్ కేసులో ఆమెకు బెయిల్.. సుప్రీం తీర్పు!

0

గతేడాది బాలీవుడ్ లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ తాకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా పరిగణించి.. శాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీలో అందరికీ డ్రగ్స్ సరఫరా చేస్తోందని అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో గత సెప్టెంబరులో జైలుపాలైంది రాగిణి. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న ఆమె.. అప్పటి నుంచీ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు.

ఫలించని ప్రయత్నాలు..
డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రాగిణి.. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టును పలుమార్లు కోరింది. అయితే.. కేసు ప్రస్తుతం విచారణలో ఉందని ఇలాంటి సమయంలో నటి రాగిణికి బెయిల్ మంజూరు చేస్తే ఆమె బయటకు వచ్చి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో కోర్టు బెయిల్ ఇవ్వలేదు.

అనారోగ్యం బారిన పడ్డారని..
పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా.. సాధ్యం కాకపోవడంతో రాగిణి ద్వివేది నిరంతర ఆందోళన చెందుతూ అనారోగ్యం బారిన పడ్డారని ఆమె తరపు న్యాయవాదులు గతంలో కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమెకు బయట ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అందుకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్ని సదుపాయాలతో ఆసుపత్రి ఉందని అక్కడే చికిత్స పొందవచ్చని సూచించింది కోర్టు.

సమ్మతించిన సుప్రీం..
రాగిణి బెయిల్ పిటిషన్ ను కర్నాటక హైకోర్టు కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది రాగిణి. ఆమె వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. నాలుగు నెలలపాటు జైళ్లో ఉన్న రాగిణి.. విడుదల కాబోతున్నారు.