సోనూసూద్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ!

0

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తనపై వేసిన కేసును కొట్టేయాలని సోనూ కోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

ముంబైలోని ఓ భవనాన్ని మునిసిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా హోటల్ గా మార్చారన్నది సోనూపై నమోదైన అభియోగం. దీంతో.. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా భవనాన్ని హోటల్ గా మార్చారని ఫిర్యాదులో పేర్కొంది బీఎంసీ.

అయితే.. ఈ కేసును సవాల్ చేస్తూ సోనూ సూద్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. పైవిధంగా తీర్పు ఇచ్చింది. కాగా.. సిటీ సివిల్ కోర్టులోనూ సోనూకు ఇదే అనుభవం ఎదురవడం గమనార్హం. సోనూ సూద్ పిటిషన్ను బాంబేే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి పృథ్వీరాజ్ చవాన్ కొట్టివేశారు. జుహూలోని ఆరు అంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే హోటల్గా మార్చారంటూ బీఎంసీ అక్టోబరులో నోటీసులు పంపింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు సోనూసూద్.

మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని పలుమార్లు నోటీసులు పంపినా సోనూసూద్ స్పదించడం లేదంటూ పోలీస్ కేసు పెట్టింది బీఎంసీ. ఐతే బీఎంసీ ఆరోపణలను సోను సూద్ ఖండించారు. నివాస భవనాన్ని హోటల్గా మార్చేందుకు బీఎంసీ నుంచి ‘చేంజ్ ఆఫ్ యూజర్’ అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశాడు సోనూ.

అయితే.. ఇటీవల విచారణ సందర్భంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోనూసూద్ అలవాటు పడ్డ నేరస్తుడని వ్యాఖ్యానించింది. బాంబే హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జుహూ ప్రాంతంలో సోనూ అనధికారికంగా భవనాలు నిర్మించారని వాటిని గతంలో రెండుసార్లు కూల్చినప్పటికీ.. పద్ధతి మార్చుకోలేదని అఫిడవిట్లో వెల్లడించింది బీఎంసీ.

కాగా.. హైకోర్టులో కూడా ఊరట దక్కకపోవడంతో హైకోర్టు డివిజినల్ బెంచ్ ను ఆశ్రయించడమా? లేదా సుప్రీంకోర్టుకు వెళ్లడమా? అనే ఆలోచన చేస్తున్నాడట సోనూ సూద్.