షూటింగ్ లో స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం..!

0

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వలిమై’ చిత్ర షూటింగ్ లో బైక్ స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అజిత్ చేతులు మరియు కాళ్లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వలిమై’ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. ఇందులో అజిత్ డూప్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం అజిత్ తన సొంత బైక్ ను ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. చిత్రీకరణ సమయంలో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

అజిత్ కు బైక్స్ అన్నా బైక్ రైడింగ్ అన్నా ఇష్టమనే విషయం తెలిసిందే. ఆయన దగ్గర అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి. అజిత్ స్పోర్ట్స్ బైక్ లపై రైడింగ్ కి వెళ్లిన వీడియోలు.. ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్ పై ప్రయాణించారు. ఇక ‘వలిమై’ సినిమా విషయానికొస్తే ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.