Templates by BIGtheme NET
Home >> Cinema News >> కృష్ణ – విజయనిర్మల ఫ్యామిలీ నుంచి వస్తున్న శరణ్ డెబ్యూ మూవీ ప్రారంభం..!

కృష్ణ – విజయనిర్మల ఫ్యామిలీ నుంచి వస్తున్న శరణ్ డెబ్యూ మూవీ ప్రారంభం..!


సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మాన్విత – కుశలకుమార్ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంతో రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు సుధీర్ బాబు – నవీన్ విజయకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. సీనియర్ నరేష్ క్లాప్ ఇచ్చారు. చిత్ర యూనిట్ దివంగత విజయనిర్మల విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ “హీరోగా పరిచయమవుతున్న మా కుటుంబ సభ్యుడైన శరణ్ కి నా అభినందనలు. ఇంతకుముందు మా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్టులను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే శరణ్ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకి దర్శకులకి నా శుభాకాంక్షలు” అని అన్నారు.

వీకే నరేష్ మాట్లాడుతూ “దర్శకుడు రామచంద్ర నాకు బాగా పరిచయస్తుడు. సోదరుడి లాంటివాడు. తను మంచి రైటర్. శరణ్ నాకు అల్లుడు అవుతాడు. ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుతున్నాను. మేమంతా శరణ్ కి సపోర్ట్ గా ఉంటాం. కచ్చితంగా ఈ సినిమా బావుంటుంది” అని అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ మా ఫ్యామిలీ నుండి మరొకరు హీరోగా ఇండస్ట్రీకి వస్తున్నారని.. హీరో కావాలని తను చాలా కష్టపడ్డాడని.. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. హీరో శరణ్ మాట్లాడుతూ “కృష్ణ గారు విజయనిర్మల గారు బ్లెస్సింగ్స్ తో హీరోగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చంద్రగారు ఏడాదిన్నరగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న మా నిర్మాతలకి థాంక్స్” అని అన్నారు.

రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ “ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో కృష్ణ గారు ముందుంటారు. విజయనిర్మల గారు నడయాడిన ఈ ప్రదేశంలో మా సినిమా ప్రారంభం కావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దీనికి వెర్సటైల్ యాక్టర్ వీకే నరేష్ గారు అందించిన సహకారం మరువలేనిది. నా కథ వినగానే మరో ఆలోచన లేకుండా వెంటనే చేద్దామని ప్రోత్సహించిన మా నిర్మాత వెంకట్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మా టీమ్ సహకారంతో ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించి ఇండస్ట్రీలో నాకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటానని తెలియజేసుకుంటున్నాను” అన్నారు. నిర్మాతలు శ్రీలత వెంకట్ మాట్లాడుతూ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి జనవరి లోపు సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం” అని పేరొన్నారు.