అనుపమ నటించిన షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్..!

0

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అరంగేట్రం చేసిన తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. విభిన్న పాత్రలతో యువ హృదయాల్ని దోచుకుంటోన్న అనుపమ.. త్వరలో ఓ లఘు చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ కు ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

దీపావళి సందర్భంగా ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ లఘు చిత్రం నుంచి అనుపమ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ చీరకట్టుతో.. కాటుక కళ్లతో కనువిందు చేస్తోంది. తన అందమైన ఉంగరాల కురులు.. నుదుటిన పెద్ద బొట్టు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆర్ జే షాన్ ఈ లఘుచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అఖిల్ మిధున్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ఇన్నాళ్లూ సినిమాలతో ప్రేక్షకులని అలరించిన అను బ్యూటీ.. ఇప్పుడు షార్ట్ ఫిక్షన్ తో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.