హైదరాబాద్ లో ఆ ఐదు థియేటర్స్ శాశ్వితంగా క్లోజ్ అవుతున్నాయా..?

0

కరోనా మహమ్మారి కారణంగా సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 9 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరమై ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి అలవాటు పడిపోయారు. అయితే ఇటీవల కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని సినిమా థియేటర్లను ఓపెన్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో క్లోజ్ అయిన సినిమా థియేటర్లు 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. త్వరలో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారని అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్ లో మంచి గుర్తింపు పొందిన ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయని వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ లో పేరు మోసిన సినిమా హాళ్లయిన గెలాక్సీ థియేటర్(టోలిచౌకి) – శ్రీ రామ థియేటర్(బహదూర్ పుర) – అంబ థియేటర్(మెహదీపట్నం) – శ్రీ మయూరి థియేటర్(ఆర్టీసీ క్రాస్ రోడ్) – శాంతి థియేటర్(నారాయణగూడ) మూతపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ ల నుంచి పోటీ ఉన్న సమయంలో కూడా ఈ ఐదు థియేటర్లలో సినిమాలను విడుదల చేస్తూ సినీ అభిమానులకు వినోదాన్ని అందిస్తూ వచ్చారు. అయితే కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటం వల్ల ఆదాయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటిని ఫంక్షన్ హాల్స్ గా మార్చే అవకాశం ఉందని అంటున్నారు.