పవన్ ప్రత్యేకతను గొప్పగా చెప్పిన రచయిత

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఫిలిం ఇండస్ట్రీలోనూ భారీగా అభిమానులున్నారు. వాళ్లలో చాలామంది పవన్ను ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా ఎక్కువ అభిమానిస్తారు. ఆయన ప్రత్యేకత గురించి గొప్పగా చెబుతుంటారు. బుధవారం పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని చాలామంది పవన్ మీద తమ అభిమానాన్ని చూపించారు. ఆయన ప్రత్యేకత గురించి చెబుతూ విషెస్ అందించారు. ఐతే వాటిలో రచయిత అబ్బూరి రవి ట్వీట్లు ప్రత్యేకం అనే చెప్పాలి. పవన్ వ్యక్తిత్వం ఎలాంటిదో కొన్ని ఉదాహరణలో ఆయన చక్కగా చెప్పుకొచ్చారు. రచయితలను పవన్ ఎంతగా గౌరవిస్తారో.. పుస్తకాల పట్ల ఆయన ప్రేమ ఎలాంటిదో ఆయన ఈ ట్వీట్లలో వివరించాడు.

తనకు ఏ గుర్తింపూ లేని సమయంలో పవన్ సినిమా ‘గుడుంబా శంకర్’కు రచయితగా పని చేసిన అనుభవాన్ని అబ్బూరి రవి గుర్తు చేసుకున్నాడు. ‘‘ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో నాకు నడుము నొప్పి వస్తోంది సర్ అంటే.. ఠక్కున లేచి లోపలికి వెళ్లిపోతే కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప దిండు తెచ్చి నన్ను పడుకోమని నా పక్కన ప్యాడ్ పెన్ పట్టుకొని కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు. అప్పటికి నా మొదటి సినిమా రిలీజ్ కూడా అవలేదు. ఆయన పవర్ స్టార్. తనతో కేవలం ఐదు రోజుల పరిచయం. అది ‘గుడుంబా శంకర్’ సినిమా కోసం. నాకు తెలీదు ఆ సినిమా లో నా పేరు వేస్తారని. అంత గౌరవం ఇస్తారని. మనిషిని మనిషిలా గౌరవించే ఆయన గుణం ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం’’ అని రవి అన్నాడు.

పవన్ ఊరికే పవర్ స్టార్ అయిపోలేదని.. ఆయన దగ్గర అబద్ధం ఆడక్కర్లేదని.. చప్పట్లు కొట్టక్కర్లేదని.. పొగడక్కర్లేదని.. మనం మనలా ఉండొచ్చని చెప్పుకొచ్చాడు రవి. ‘అన్నవరం’ సినిమా స్క్రిప్ట్ కోసం డైలాగ్ కోసం రాత్రి పగలు పవన్తో గడిపిన ప్రతి క్షణం తనకు గుర్తున్నాయంతే అది ఆయన గొప్పదనమే అన్నాడు రవి. ఆ సినిమా టైంలోనే ఆయనకిచ్చిన తన 1983 చందమామ కధల బౌండ్ మళ్లీ ఐదేళ్ల తర్వాత ‘పంజా’ సినిమాకు రాయడానికి ముందు ఒక అసిస్టెంట్తో పంపించారని.. అది అందినట్టు కాల్ చేయమని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని.. ‘పుస్తకం విలువ తెలి సిన మనిషికి జీవితం విలువ కచ్చితంగా తెలుస్తుంది’ అనడానికిది నిదర్శనమని చెప్పాడు. పవన్ వ్యక్తిత్వాన్ని తన మాటల్లో చెప్పాలని పంజా సినిమాలో ప్రయత్నించానని.. అప్పుడు పుట్టిన మాటలే “సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు” అని రవి తెలిపాడు.