కేజీఎఫ్ డైరెక్టర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న యూవీ నిర్మాతలు

0

కేజీఎఫ్ సినిమాతో ఆల్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను తెరకెక్కస్తున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో కేజీఎఫ్ మొదటి పార్ట్ కు పది రెట్ల అధిక ఓల్టేజ్ యాక్షన్ సినిమాను తెరకెక్కస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేసే అవకాశం కనిపిస్తుంది. తెలుగు హీరోలకు పాన్ ఇండియా మార్కెట్ ఉండటంతో పాటు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే తెలుగు సినిమాలకు భారీ బడ్జెట్ పెడతారు అనే ఉద్దేశ్యంతో ఆయన తెలుగు సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కు ప్రశాంత్ నీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా మైత్రి వారు ప్రశాంత్ నీల్ తో సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. కరోనా కారణంగా ఎన్టీఆర్ 30 సినిమా ఆలస్యం అవుతుంది. కనుక ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ మరో హీరోతో సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ప్రశాంత్ నీల్ ను తమ బ్యానర్ లో సినిమా చేయించేందుకు యూవీ క్రియేషన్స్ వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కేజీఎఫ్ చూసిన తర్వాత ప్రభాస్ కు కూడా ప్రశాంత్ నీల్ సినిమా చేయాలనే ఆసక్తి కలిగిందట. ఇద్దరికి కూడా కాంబో సూపర్ సెట్ అవుతుందని కూడా భావిస్తున్నారు. అందుకే యూవీ క్రియేషన్స్ వారు ప్రశాంత్ నీల్ తో సినిమాకు కమిట్ చేయించేందుకు భారీ ఆఫర్ ను కూడా ఇస్తున్నారట. ఒక వేళ ప్రశాంత్ నీల్ ఓకే చెప్పినా కనీసం రెండున్నర ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు. అప్పటి వరకు అయినా ప్రశాంత్ నీల్ ను ప్రభాస్ కోసం బుక్ చేయాలని యూవీ నిర్మాతలైన వంశీ మరియు ప్రమోద్ లు చర్చలు జరుపుతున్నారు. మరి ప్రశాంత్ నీల్ మాట ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.