బిబి3 సంక్రాంతికి సాధ్యమేనా?

0

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత మేరకు పూర్తి అయిన సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయింది. గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్ జరగలేదు. టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైన నేపథ్యంలో మెల్లగా బాలయ్య.. బోయపాటిల కాంబో మూవీని కూడా పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల నుండి షూటింగ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.

ఇప్పటి వరకు సినిమా కనీసం సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. అయినా కూడా మీడియా సర్కిల్స్ లో సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే షూటింగ్ ఇంకా చాలా ఉండటంతో పాటు ఈ సమయంలో షూటింగ్ స్పీడ్ గా చేయడం కూడా సాధ్యం కాదు కనుక ఈ ఏడాది చివరి వరకు బిబి3 షూటింగ్ ముగింపు సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కరోనా సమయంలో తక్కువ మంది టెక్నీషియన్స్ మరియు నటీనటులతో షూటింగ్ నిర్వహించాల్సి వస్తుంది. అందువల్ల మునుపటి స్పీడ్ తో షూటింగ్స్ జరగడం లేదు అనేది కొందరి వాదన. ఇక బాలయ్య వంటి స్టార్ హీరో సినిమా అదీనూ భారీ యాక్షన్ సినిమాను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదని సినీ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. బోయపాటి హడావుడిగా పూర్తి చేయాలనుకుంటే తప్ప బిబి3 మూవీ ఈ ఏడాదిలో పూర్తి అవ్వదు.

బాలయ్యతో పాటు బోయపాటికి కూడా ఈ సినిమా చాలా కీలకం. కనుక సినిమాను మెల్లగానే బోయపాటి శ్రీను తెరకెక్కించే అవకాశం ఉంది. అప్పుడు సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు సినిమాలో హీరోయిన్.. విలన్ విషయంలో క్లారిటీ రాలేదు. సినిమాను 30 శాతం వరకు మాత్రమే షూటింగ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.