‘కలర్ ఫోటో ‘ దర్శకుడికి బంపర్ ఆఫర్..!

0

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేసిన సందీప్ రాజ్ ”కలర్ ఫోటో” సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ – బెన్నీ ముప్పనేని కలిసి నిర్మించిన ఈ సినిమా ఇటీవలే ‘ఆహా’ ఓటీటీలో విడుదల అయింది. కమెడియన్ సుహాస్ – తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి హీరోహీరోయిన్స్ గా నటించిన ‘కలర్ ఫోటో’ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ని అభినందిస్తున్నారు. ‘కలర్ ఫోటో’ ని ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తీసి సక్సెస్ అయ్యాడని.. 20 ఏళ్ళ క్రితం నేపథ్యాన్ని ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించాడని.. నటీనటుల నుంచి కావాల్సినంత మేర నటనను రాబడ్డాడని అందరూ దర్శకుడిని మెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కి బంపర్ ఆఫర్ తగిలిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సందీప్ రాజ్ నెక్ట్స్ సినిమా గీతాఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ లో ఉండబోతోందట. ఈ చిత్రాన్ని యంగ్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ (శ్రీనివాస్ కుమార్) నిర్మిస్తాడని అంటున్నారు. ఎస్.కె.ఎన్ ఇంతకముందు ‘ఈరోజుల్లో’ మరియు విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ చిత్రాలను నిర్మించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అలానే గీతాఆర్ట్స్ మరియు యూవీ క్రియేషన్స్ వారితో కలిసి ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇప్పుడు ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటణ త్వరలోనే రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.