బన్ని డ్యాన్సులంటే పడి చస్తున్న బుట్ట బొమ్మలు

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సింగ్ స్కిల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ క్లాస్ డ్యాన్సర్లలో బన్ని ఒకరు. బన్ని డ్యాన్సులకు హృతిక్ అంతటి వాడే ఫిదా అయ్యాడు. అతడికి అటు బాలీవుడ్ లోనూ స్టార్లలో వీరాభిమానులున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. ఇరుగు పొరుగు పరిశ్రమలలో ఈ నటుడికి భారీ అభిమానులు ఉన్నారు. అన్నట్టు ఆయన అభిమానుల ఖాతాలో ఊర్వశి రౌతేలా కూడా చేరింది.

నేను లేడీ అల్లు అర్జున్ లాగా వ్యవహరించినప్పుడు నా చిత్రం బ్లాక్ రోస్ కోసం నా సౌత్ ఇండియన్ డాన్స్ స్టైల్ ని మీకు అందిస్తున్నాను అంటూ ఓ డ్యాన్సింగ్ వీడియోని అభిమానులకు ట్విట్టర్ లో షేర్ చేసింది ఊర్వశి. అల్లు అర్జున్ తనకు ప్రేరణ అని ఊర్వశి వెల్లడించారు. బాలీవుడ్ నుండి జనాదరణ పొందిన వ్యక్తిత్వాన్ని చూడటం చాలా అరుదు. అయితే ఇలా దక్షిణాది హీరోపై ఉత్తరాది భామ అభిమానం పెంచుకోవడం ఆసక్తికరం.

అదంతా సరే కానీ.. ఊర్వశి మాత్రమేనా? అంటే బన్ని అంటే పడిచచ్చే భామల జాబితాలో చాలామంది ఉన్నారు. తొలిగా ఆర్య లో డ్యాన్సులకు ఫిదా అయిపోయన కాజల్ .. ఓ పబ్లిక్ వేదికపై బన్ని గ్రేట్ డ్యాన్సర్ అంటూ పొగిడేసింది. అంతకుముందు దిశా పటాని కూడా `బుట్ట బొమ్మ` కోసం డ్యాన్స్ చేసి అల్లు అర్జున్ కు అంకితం చేసింది. దిశా పటానీ మరోసారి టాలీవుడ్ లో అడుగు పెడితే బన్నితో సినిమా చేయాలనుకుంటోందట. ఇకపోతే బుట్ట బొమ్మలో ఒరిజినల్ ప్యారీ పూజా హెగ్డే అయితే బన్ని డ్యాన్సులకు ఏనాడో ఫిదా అయిపోయానని అల.. ప్రమోషన్స్ లో చెప్పింది. ఇలా చూస్తే చాలా మంది బుట్టబొమ్మలకు బన్ని డ్యాన్సులన్నా అతడన్నా విపరీతమైన క్రష్ అని అర్థమైపోతోంది.