డబ్బుల కోసం ప్రచారం.. ఆ హీరోయిన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

0

డబ్బులిస్తే చాలు ఏ షాప్ ఓపెనింగ్ కు అయినా హీరోయిన్లు వచ్చేస్తుంటారన్న విమర్శ సినీ ఇండస్ట్రీలో ఉంది. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా సరే హీరోయిన్లు లక్షలు కోట్లు తీసుకొని ఆయా ఓపెనింగ్ లకు వస్తుంటారు. డబ్బే ప్రధానం ఇక్కడ.. ఆ సంస్థ షాపుల యజమానులతో పెద్దగా వారికి డీలింగ్స్ ఉండవు.. వారి బట్టలు వేసుకోరు వీళ్లు. అయితే ప్రతీచోట డబ్బులు ఇచ్చి సేఫ్ గా పంపిస్తారనుకుంటే పొరపాటే. బీహార్ ఎన్నికల్లో డబ్బులిస్తే ప్రచారానికి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కు చుక్కలు కనిపించాయి.

బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్జేపీ అభ్యర్థి కోసం అమీషా పటేల్ ప్రచారానికి వెళ్లింది. ఈ క్రమంలోనే బెదిరింపులకు బ్లాక్ మెయిల్ కు అమీషా గురైంది. ఎల్జేపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర కోసం అమీషా పటేల్ ప్రచారం చేపట్టింది. అయితే ప్రచారంలో ప్రకాష్ చంద్ర తనతో దురుసుగా వ్యవహరించాడని అమీషా ఆరోపించింది. బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని.. తేడాగా ప్రవర్తించడంతో నాకు భయం కలిగిందని అమీషా పటేల్ ఆరోపించింది. బీహార్ ప్రచారంలో ఎప్పుడు ఎవరు రేప్ చేస్తారో? ఎవరు చంపేస్తారనే భయంతో వణికిపోయాను.. నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముంబైకి తిరిగి వచ్చాను అంటూ అమీషా పటేల్ చెప్పినట్టు ఓ ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. నా టీమ్ వెంట ఉండి కాపాడారని.. మరో అవకాశం లేకపోవడంతో సురక్షితంగా బయటపడి ముంబైకి చేరుకున్నానని వివరించింది. ఈ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

కేవలం డబ్బులు ఇస్తే అమీషా ముక్కు మొఖం తెలియని వారి కోసం ప్రచారానికి వెళ్లడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.. అసలు ఆ ఎల్జేపీ పార్టీ ఏంటో.. ఆ అభ్యర్థి ప్రకాష్ చంద్ర ఎవరో కూడా ఆమెకు తెలియదట. ఇక డబ్బులిచ్చాం కదా అని అమీషా పటేల్ ను వీధులు వాడలు అంతా తిప్పేశారు ఆ నాయకులు. ఆమెకు ఫ్లైట్ టైం అవుతున్నా కూడా విడిచిపెట్టకుండా ఇబ్బంది పెట్టారు. చివరకు ఎలాగోలా వదిలేయడంతో బ్రతుకు జీవుడా అంటూ బయటపడింది.

ఇలా పైసలు కోసం పోతే మానప్రాణాలకే ముప్పు అని సదురు హీరోయిన్ కు ఇప్పుడు తెలుసొచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా డబ్బుల కోసం ఇలా చేస్తూ జనాలను ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు కొందరు మేధావులు సదురు హీరోయిన్ ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా హీరోయిన్లు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.