‘కపటధారి’ :టీజర్..!

0

అక్కినేని హీరో సుమంత్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. లేటెస్టుగా ‘కపటధారి’ అనే ఎమోషనల్ థ్రిల్లర్ తో వస్తున్నాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మించారు. కన్నడ హిట్ సినిమా ‘కావలధారి’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఇప్పటికే ‘కపటధారి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్ ను టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.

”ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది” అని హీరో సుమంత్ చెప్పే డైలాగ్ ని బట్టి చూస్తే ఈ చిత్రం ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉందనే కథాంశంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ టీజర్ లో ఒక హత్య కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో సుమంత్ కూడా జాయిన్ అవుతానని అడుగుతాడు. ‘అక్కడ ఏదో తేడా జరిగింది.. నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది’ అంటూ సుమంత్ మర్డర్ మిస్టరీని చేధించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. టీజర్ చివర్లో ‘వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి’ అంటూ చెప్పడం ద్వారా దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనే సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. దీనికి బ్యాగ్రౌండ్ లో వచ్చే “రంగులు మార్చే లోకం.. పాచికలాడే న్యాయం.. నీతీ నియమం మరిచి.. జీవితమంటే యుద్ధం.. పోరాడటమే లక్ష్యం.. కన్నులు కప్పి తిరిగేవాడేరా.. కపటధారి” అంటూ సినిమా నేపథ్యాన్ని చెప్పే సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

‘కపటధారి’ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. నాజర్ – జయప్రకాష్ – సుమన్ రంగనాథ్ – వెన్నెల కిషోర్ – సంపత్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సైమన్ కె.కింగ్ మ్యూజిక్ అందించగా రసమతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్ గా వర్క్ చేసారు. ఈ చిత్రాన్ని తమిళ్ లో కట్టప్ప సత్యరాజ్ కొడుకు శిబి సత్యరాజ్ హీరోగా అదే పేరుతో రూపొందించారు. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.