ప్రియాంక చోప్రా ”ది వైట్ టైగర్” ట్రైలర్ విడుదల…!

0

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్ – రాజ్ కుమార్ రావు – ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ”ది వైట్ టైగర్”. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రూపొందించిన ఈ చిత్రానికి హాలీవుడ్ దర్శకుడు రమిన్ బహ్రాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత అరవింద్ అడిగా రాసిన ‘ది వైట్ టైగర్’ నవల ఆధారంగా రూపొందింది. ‘ది వైట్ టైగర్’ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలిచి 2008లో మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి నవల ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని 2021 జనవరిలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. లేటెస్టుగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

బిజినెస్ చేయడం కోసం యూఎస్ నుంచి ఇండియాకి వచ్చిన ధనవంతుల జంటగా ప్రియాంక చోప్రా – రాజ్ కుమార్ రావు కనిపిస్తున్నారు. ఆదర్శ్ గౌరవ్ ఇండియాకు చెందిన పేద డ్రైవర్ గా కనిపించనున్నాడు. అమెరికా నుంచి వచ్చిన అశోక్ – పింకీ జంటకు డ్రైవర్ గా ఉన్న బలరామ్ హల్వాయి(ఆదర్శ్ గౌరవ్) ఎలాంటి పన్నాగాలు కుయుక్తులు పన్ని ధనవంతుడిగా అయ్యాడు అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ప్రియాంక చోప్రా – రాజ్ కుమార్ రావు కంటే ఆదర్శ్ గౌరవ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు అనిపిస్తోంది. మొత్తం మీద ఆధ్యంతం థ్రిల్ కలిగిస్తూ ఉన్న ‘ది వైట్ టైగర్’ ట్రైలర్ ఆకుట్టుకునేలా ఉంది.