Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆన్ లైన్ టిక్కెటింగ్ తో దొంగ లెక్కలకు చెక్

ఆన్ లైన్ టిక్కెటింగ్ తో దొంగ లెక్కలకు చెక్


ఆన్ లైన్ టికెటింగ్ కావాలంటూ గగ్గోలు పెట్టేది ఎందుకు? థియేటర్ ఆక్యుపెన్సీ ఎంత? కలెక్షన్లు వాస్తవికంగా ఎలా ఉన్నాయి? ఏ హీరోకి ఓపెనింగుల రేంజు ఎంత? లాంగ్ డ్రైవ్ లో వసూళ్ల సత్తా ఎంత? అన్నది క్లారిటీగా తెలుసుకునేందుకే ఇదంతా. కానీ ఈ విధానానికి తూట్లు పొడుస్తూ తప్పుడు లెక్కలు చెబుతూ మా హీరో ఇంత అంటే మా హీరో అంత అంటూ ప్రగల్బాలు పలికేవాళ్లే ఎక్కువయ్యారు. ఏదీ ఇక్కడ పారదర్శకంగా ఉండదు. తొలి వారం లెక్కలు సహా వీకెండ్ కలెక్షన్స్.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అంటూ చేసే ఏ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేరు.

అయితే అన్నిటికీ చెక్ పెట్టేయాలంటే ఆన్ లైన్ టికెటింగ్ అవసరం. టికెటింగ్ విండో వద్ద తెగే ప్రతి టిక్కెట్టుకి లెక్క తేల్తుంది పక్కాగా. ఇక థియేటర్ క్యూలైన్ లో నుంచోవాల్సిన దుస్థితి కూడా ఉండదు. అయితే వీటన్నిటికీ కరోనా మహమ్మారీ ఒక సొల్యూషన్ ని జనం ముందుకు తేనుందని భావిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారీ వల్ల లాక్ డౌన్ లు ముగిసి అన్ లాక్ 4.0 వరకూ వచ్చాం. ఇక పైనా థియేటర్లను మాల్స్ ని మూసి ఉంచితే ఈ రంగంలో పని చేస్తున్న వారికి బతుకులే కష్టం. అందుకే ఇకపై థియేటర్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయనుంది కేంద్రం.

గత మూడు వారాలుగా సెప్టెంబర్ నుండి సినిమా హాళ్ళు తెరుచుకుంటాయనే చర్చకు తగ్గట్టే ఇంకో పది రోజుల్లోనే థియేటర్లు తెరుచుకునే వీలుందని తెలుస్తోంది. జనం కరోనా భయం నుంచి తేరుకుని నెమ్మదిగా థియేటర్ల బాట పడతారని ఆశిస్తున్నారు. ప్రారంభంలో ఆక్యుపెన్సీ 25-30 శాతమే ఉండొచ్చు. క్రమంగా పెరిగే వీలుంటుంది.

అయితే థియేటర్లలో భౌతిక టికెటింగ్ ఉండదు. కౌంటర్ టిక్కెట్ల కోసం క్యూలలో నిలబడి ఉండాల్సిన పనే లేదు. సింగిల్ స్క్రీన్లు లేదా మల్టీప్లెక్స్లు అయినా ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి అవుతుంది. దీనర్థం తెగే ప్రతి టిక్కెట్టుకి లెక్క తేలుతుందనే. అందుకే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ఇక పలు ఏజెన్సీలు ఈ విధానంలో పారదర్శకతను తెచ్చేందుకు ఆన్ లైన్ రూపకల్పన చేస్తుండడం ఆసక్తికరం. ఇది టికెటింగ్ లో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా భావించవచ్చు. ఒక రకంగా ఇది బాక్సాఫీస్ లెక్కలు చెప్పేవారికి.. సినీ ప్రియులకు ఇది గొప్ప విషయమేనని చెప్పాలి. ఇండస్ట్రీ రికార్డులు .. 200 కోట్ల క్లబ్ అంటూ పోస్టర్లు ఇక కనిపించి.. వినిపించే వీల్లేదేమో!