ఒకేసారి రెండు పడవలపై గజిబిజి దారిలో డార్లింగ్?

0

పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజుకు ప్రభాస్ ని తీసుకుని వెళతామని మాటిచ్చారు నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందం. వీళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రభాస్ కచ్ఛితంగా హాలీవుడ్ స్టార్లకు ధీటుగా ఎదిగేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి లాంటి ప్రతిభావంతమైన బయోపిక్ తీసిన నాగ్ అశ్విన్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని విజువల్ గ్రాఫిక్స్ మాయాజాలంతో సవ్యరీతిలో చూపించగలడని శంకర్ .. రాజమౌళి తర్వాత ఆ ప్లేస్ ని అందుకుంటాడని ఆశిద్దాం. సౌత్ నుంచి ఇలాంటి ఆరోగ్యకర పోటీ అంతకంతకు పెరగాలి.

అదంతా సరే కానీ.. నాగ్ అశ్విన్ కంటే ముందే ఓం రౌత్ చూపిస్తున్న స్పీడ్ కి అంతా డంగైపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే 500కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్-3డి ప్రాజెక్టుని ప్రకటించగానే ఒకటే కన్ఫ్యూజన్ కి లోనయ్యారు. ఇంతకీ ఎవరితో ముందు ఎవరితో తర్వాత? అన్నది తేలలేదింకా. అంతకంతకు డైలమా పెరిగిపోతోంది. టెన్షన్ చుట్టుముట్టేస్తోంది.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. తొలిగా నాగ్ అశ్విన్ సినిమాని ప్రారంభించి ఇది ముగుస్తుంది అనుకుంటుండగానే ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డిని ప్రారంభించే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇంచుమించుగా సైమల్టేనియస్ గా ఈ సినిమాల్ని తెరకెక్కించే వీలుందట. వచ్చే ఏడాది ప్రకటించిన ఈ రెండు ప్రాజెక్టులకు తేదీలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయనున్నాడని తెలిసింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ .. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే పౌరాణేతిహాస నేపథ్య సినిమా అంతకంతకు అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి. రెండు పాన్ వరల్డ్ సినిమాలకు ఒకేసారి కమిటైన ప్రభాస్ పై పదింతలు అంచనాలు రెట్టించాయి. బాహుబలి 2.. సాహో ని మించిన సంచలనాలు మునుముందు నమోదు చేస్తాడనే అంతా భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలను 2022 లో విడుదల చేయాలంటే ముందుగా మహమ్మారీకి వ్యాక్సిన్ రావాలి.