మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

0

కరోనా మహమ్మారి సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వైరస్ ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘ఆచార్య’ షూటింగ్ ని ప్రారంభించే క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేపించుకోగా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చినట్లు చిరంజీవి పేర్కొన్నారు. గత నాలుగైదు రోజుల్లో తనకు కలిసిన వారందరిని టెస్ట్ చేయిచుకోవాల్సిందిగా చిరు కోరారు.

”ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అక్కినేని నాగార్జునతో కలిసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సంగతి తెలిసిందే. అలానే ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు రామ్ చరణ్ లు చిరంజీవితో కలిసి కాసేపు సమయం గడిపారు. ఇప్పుడు చిరంజీవిని కలిసిన వీరందరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు – రాజమౌళి – కీరవాణి ల కుటుంబం – బండ్ల గణేష్ – తమన్నా వంటి వారు కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్ ఫ్యామిలీకి కూడా కరోనా సోకగా శివాని – శివాత్మిక మరియు జీవిత లు కరోనాను జయించారు. రాజశేఖర్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.