సుధీర్ బాబుని ‘వి’ నుంచి సైడ్ చేసేశారా…?

0

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. కరోనా మహమ్మారి లేకపోయుంటే ఈ సినిమా ఉగాదికి విడుదలై.. ఈ పాటికి ఓటీటీ మరియు టీవీల్లో కూడా ప్రసారం అయ్యుండేది. కానీ ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ‘వి’ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో లేటెస్టుగా ”వి” సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసారు.

కాగా నాని కెరీర్లో 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అందుకే ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పటికీ హీరో నాని బాగానే ప్రచారం చేస్తున్నాడు. అయితే భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు ఉన్నాడని.. జనాల దగ్గర నుంచి మీడియా వరకు అందరూ మర్చిపోయారేమో అనే అనుమానం కలుగుతోందని.. ఆఖరుకి చిత్ర యూనిట్ కూడా సుధీర్ ని విస్మరించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రసార కార్యక్రమాల్లో సుధీర్ బాబు కనిపించలేదు. దీనికి కారణం అమెజాన్ వారికి సుధీర్ బాబు ఈ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడనే ఫీడింగ్ వెళ్లడమే అని అనుకుంటున్నారు.

వాస్తవానికి ”వి” ట్రైలర్ చూస్తుంటే నాని కి ఈక్వల్ గా సుధీర్ బాబు పాత్ర ఉండబోతోందని అర్థం అవుతోంది. అంతేకాకుండా సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డూప్ లేకుండా యాక్షన్ స్టంట్స్ కూడా చేశాడు. ట్రైలర్ లో సుధీర్ బాబు ని చూసిన ఎవరికైనా ఈ విషయం ఈజీగా తెలిసిపోతుంది. అయినా ఎన్ని చేసినా ఏం లాభం.. సుధీర్ బాబు కష్టాన్ని గుర్తించప్పుడు అని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ‘వి’ విడుదలకు వారానికి పైగా సమయం ఉండటంతో ఇప్పటి నుంచైనా సుధీర్ బాబుని ”వి” చిత్రంలో మరో హీరోగా గుర్తించి.. అతనికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.