తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలుగు చిత్ర పరిశ్రమ పై కురిపించన వరాల జల్లుకు సినీ వర్గాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ట్రేడ్ వర్గాల్లో మాత్రం కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షోలు పెంచుకునే అవకాశం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు ఇవ్వడం.. అలానే డిమాండ్ ని బట్టి థియేటర్ టిక్కెట్ రేటు పెంచడం కొంత వరకు బాగానే ఉంటుంది. ఆ తరువాత థియేటర్ ఓనర్స్.. డిస్ట్రీబ్యూటర్లు ఈ పద్ధతికి అలవాటు పడితే మాత్రం ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తం అవుతుంది.
షోలు పెంచుకునే వెసులుబాటు.. డిమాండ్ ని బట్టి టిక్కెట్ ధర పెంచే పద్ధతికి ఆల్ లైన్ బుకింగ్ ఉంటేనే ఈ ప్రక్రియలు సక్రమంగా నడిచే వీలు ఉంటుందని.. 90 శాతం ఆఫ్ లైన్ మోడ్ లోనే టిక్కెట్ బుక్కింగ్ జరిగే తెలుగు చిత్ర పరిశ్రమ పై ఈ కొత్త పద్ధతులు కరోనా క్రైసిస్ ముగిసే వరకు మంచే చేసినా.. ఆ తరువాత చెడు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో లేకపోవడంతో ప్రయివేటు దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అలాగే మల్లీప్లెక్సుల్లో తినుబండారాలు కోక్ ల ధరలు నియంత్రించాలనుకున్నా అవేవీ తగ్గిందే లేదు. ఇక ప్రభుత్వాలకు వసూలు కావాల్సిన పన్నులు సక్రమంగా చెల్లించకుండా దొంగ లెక్కలు చూపించేవారిపై దృష్టి పెట్టాలి. టికెటింగ్ వ్యవస్థ లోపాల్ని సమూలంగా సవరించాలి. చిన్న సినిమాని ఆదుకునేందుకు ఇంకా పెద్ద సాయం కావాల్సి ఉంటుంది… అంటూ రకరకాల వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ తరహా ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ లో ప్రారంభించాలని.. ఫిలిం టెక్నాలజీతో స్టూడియోల వృద్ధి జరగాలని కూడా చిన్న నిర్మాతలు కోరుతున్నారు.