కనకాల ఫ్యామిలీ నుంచి హీరో వచ్చేస్తున్నాడు..!

0

సినీ ఇండస్ట్రీలో నెపోటిజం పై ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరిగినా నటవారసుల అరంగేట్రం మాత్రం ఆగదు. మన టాలీవుడ్ లో కూడా అనేక మంది ఫ్యామిలీ హీరోలు ఇంట్రడ్యూస్ అయ్యారు. మెగా ఫ్యామిలీ – అక్కినేని ఫ్యామిలీ – నందమూరి ఫ్యామిలీ – దగ్గుబాటి ఫ్యామిలీ – ఘట్టమనేని ఫ్యామిలీ – మంచు ఫ్యామిలీ.. ఇలా ప్రతి కుటుంబం నుంచి నెపోటిజం హీరోలు వచ్చారు. అయితే బ్యాగ్రౌండ్ అనేది మొదటి సినిమాకి మాత్రమే పనికొస్తుంది.. ఆ తర్వాత తమను తాము నిరూపించుకోకపోతే సినిమాలకు దూరం అవ్వాల్సిందే. ఇదే క్రమంలో ఇప్పుడు కనకాల ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

కనకాల ఫ్యామిలీ ఎప్పటి నుంచో చిత్ర పరిశ్రమలో ఉందనే విషయం తెలిసిందే. నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల హైదరాబాద్ లో యాక్టింగ్ స్కూల్ ఏర్పాటు చేసి ఎంతోమందికి నటనలో మెళకువలు నేర్పించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ఆర్టిస్టులుగా వెలుగొందతున్న చాలా మంది ఈ స్కూల్ నుంచి వచ్చిన వారే. ఆయన భార్య లక్ష్మీ కనకాల కూడా పలు సినిమాల్లో నటించారు. దేవదాస్ కుమారుడు రాజీవ్ కనకాల – కుమార్తె శ్రీలక్ష్మి కూడా సినిమాల్లో నటిస్తున్నారు. రాజీవ్ కనకాల సతీమణి సుమ బుల్లితెరపై యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ ని దక్కించుకుంది. ఇప్పుడు రాజీవ్ – సుమ వారసుడు రోషన్ కనకాలను హీరోగా వెండితెరకు పరిచయం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రోషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మరో నిర్మాణ సంస్థతో కలిసి సుమ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. రోషన్ కనకాల ఇంతకముందు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.