లేడీ విలన్ గ్యాంగ్స్ తో తస్మాత్ జాగ్రత్త!

0

కథానాయికలు విలన్లుగా నటించడం అన్నది అనాదిగా ఉన్నదే. పొగరు మోతు అత్త పాత్రలు .. మంత్రగత్తె పాత్రలు చేసిన వాళ్లు ఉన్నారు. ఇటీవల దివంగత నటి శ్రీదేవి తమిళ హీరో విజయ్ సినిమాలో మంత్రగత్తెగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల పలువురు అగ్రశ్రేణి తారలు కొందరు సినిమాలకు దూరమైపోయినా.. కంబ్యాక్ కోసం కొత్తగా ట్రై చేస్తున్నారు. చాలా ధైర్యంగా కొన్ని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను ప్రయత్నిస్తున్నారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ లో పాత్రల తీరుతెన్నులు మారుతున్నాయి.

`పోకిరి`లో శివ్ రానా చేసిన పాత్రను యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అది మాఫియా గ్యాంగ్ సభ్యురాలి పాత్ర. ఇక సీనియర్ నటీమణులు వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గ విలనీని ఎంచుకుంటున్నారు. ఇక పొగరుమోతు అత్త పాత్రలో సీనియర్ నటి నదియా ఇటీవల అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇవేవీ టీవీ సీరియల్ తరహా స్టీరియో టైప్ విలనీలు కాకపోవడంతో జనాలకు బాగానే ఎక్కేసాయి.

పూర్తి స్థాయి నెగటివ్ రోల్స్ చేసే విషయానికి వస్తే.. స్టార్ విలన్ కు ధీటైన పాత్రల్ని మేకర్స్ ఎక్కువగా హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ చాలా కాలంగా ఈ తరహా నెగటివ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పుడు తమన్నా .. పూర్ణ ఈ తరహా లోనే తదుపరి చిత్రాలలో విలన్ పాత్రల్లో నటిస్తున్నారు.

కథానాయికలే విలన్లు అనే ప్రాతిపాదికన హీరోయిన్ల కోసం మరిన్ని విలన్ పాత్రల్ని దర్శకరచయితలు తీర్చిదిద్దుతున్నారు. మన స్టార్ హీరోయిన్లు ఈ తరహా విలనీ చేయడానికి అంగీకరిస్తున్నారు. తద్వారా బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకునేందుకు వెసులుబాటు పెరిగింది. ఇంతకుముందులా హీరో సరసన నాలుగు పాటలు ఐదు ప్రేమకలాపాలకు పరిమితమయ్యే పాత్రలు ఇకపై పరిమితం కానున్నాయి.