దర్శకురాలిగా మారిన ప్రముఖ దర్శకుడి సోదరి..!

0

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సోదరి ఇంద్రగంటి కిరణ్మయి డాక్యుమెంటరీలు తీయడంతో పాటు పలు రచనలు చేసి సినిమాపై పరిజ్ఞానం సంపాదించుకున్నారు. అయితే డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ కిరణ్మయి ఇంద్రగంటి ఇప్పుడు తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేసింది. ‘ఏ డాల్స్ హౌజ్’ అనే నార్వేజియన్ నాటకాన్ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాకు “రాళ్ళలో నీరు” అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి ‘హిడెన్ వాటర్’ అనేది ఉపశీర్షిక. అనల్ప అండ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం ఐదు పాత్రలతో మనుషుల్లో అంతర్గతంగా ఉండే లోపాల్ని.. భావోద్వేగాల్ని ఒడిసిపట్టే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికీ రెడీ అయిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

కాగా “రాళ్ళలో నీరు” చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయిన వెంటనే లాస్ ఏంజిల్స్ లో జరిగిన అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు పంపించారని తెలుస్తోంది. అక్కడ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదైనా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి కిరణ్మయి ఇంద్రగంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కృష్ణ మంజుష – అథ్లఫ్ – షఫి – బిందు చంద్రమౌళి – డాక్టర్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆర్.ఆర్ కోలంచి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్ గా వర్క్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు.