డిజాస్టర్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు

0

‘అలా ఎలా’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్ణిని ఆకర్షించాడు అనీష్ కృష్ణ. రాహుల్ రవీంద్ర వెన్నెల కిషోర్లను హీరోలుగా పెట్టి తీసిన ఈ సినిమా పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న కామెడీ బాగా పండించగల దర్శకుడిగా పేరు సంపాదించాడు అనీష్. ఐతే తొలి సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు సంకేతాలిచ్చి.. ఆ తర్వాత దిల్ రాజు పిలిచి అవకాశం ఇవ్వడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి రాజ్ తరుణ్ హీరోగా ‘లవర్’ సినిమా తీశాడు. ఈ సినిమాకు అనీష్ కోరుకున్న దాని కంటే మంచి వనరులే సమకూరాయి. కానీ వాటిని అతను ఉపయోగించుకోలేకపోయాడు. రాజ్ తరుణ్ మార్కెట్కు మించి ఖర్చు పెట్టి ఒక మామూలు సినిమా తీశాడు. అది డిజాస్టర్ అయి అనీష్ కెరీర్కు బ్రేకులేసింది.

ఇలాంటి ఫలితం తర్వాత అవకాశాలు దక్కడం అంత సులువు కాదు. కానీ అనీష్ కొంచెం గ్యాప్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు మొదలుపెట్టి ఆశ్చర్యపరిచాడు. అందులో ఒకటి కొన్ని రోజుల కిందటే మొదలైంది. నాగశౌర్య హీరోగా అతడి సొంత బేనర్ లో అనీష్ దర్శకుడిగా ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల గ్యాప్లోనే అనీష్ దర్శకుడిగా మరో చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. అదే.. గాలి సంపత్. శ్రీ విష్ణు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఇది. ఇందులో గాలి సంపత్గా టైటిల్ రోల్ చేస్తున్నది రాజేంద్ర ప్రసాద్ కావడం విశేషం. నిన్ను కోరి మజిలీ లాంటి పెద్ద హిట్లు ఇచ్చిన నిర్మాతలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత ఓ యువ దర్శకుడికి రెండు సినిమాల్లో అవకాశాలు దక్కడం.. పేరున్న ప్రొడక్షన్ హౌస్లు వాటిని నిర్మించడం.. రెండూ కొన్ని రోజుల వ్యవధిలో ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ముందుగా ‘గాలి సంపత్’ను పూర్తి చేసి ఆ తర్వాత శౌర్య సినిమా మీదికి వెళ్లనున్న అనీష్.. ఈ రెండు చిత్రాలతో ఎలాంటి ఫలితాలందుకుంటాడో చూడాలి.