బాలు తెలుగు సినిమాకు చేసిన పాపమేంటి?

0

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా ఆసుపత్రి పాలై.. ఆయన పరిస్థితి కొంచెం విషమించిందన్న వార్త బయటికి రావడం ఆలస్యం.. తమిళ జనాలు పడుతున్న వేదన ఆయన ఆరోగ్యం కుదుటపడాలని వాళ్లు పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది అందరికీ. నార్త్ వాళ్లు ఇదంతా చూస్తే బాలు తమిళుడని అనుకున్నా అనుకుంటారేమో. రాజమౌళినే తమిళుడని ‘బాహుబలి’ని తమిళ సినిమా అని అనుకున్న వాళ్లు బాలు విషయంలో ఇలా ఫీలైతే ఆశ్చర్యమేముంది. కోలీవుడ్కు చెందిన ప్రతి ఫిలిం సెలబ్రెటీ.. బాలు అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక వీడియో సందేశం పెట్టడమో.. ఆడియో రిలీజ్ చేయడమో.. లేదంటే ట్వీట్ వేయడమో.. ప్రతికా ప్రకటన ఇవ్వడమో చేశారు. ఒక్కొక్కరి బాధ చూస్తే బాలు మీద వారికి ఇంత అభిమానమా అనిపిస్తోంది. తమ భాష సంస్కృతి మీద విపరీతమైన అభిమానం చూపించే తమిళులు.. ఒక తెలుగువాడి మీద చూపిస్తున్న అభిమానం అబ్బురపరిచేదే.

కానీ దేశం గర్వించదగ్గ మన దిగ్గజం గురించి మన ఫిలిం సెలబ్రెటీలు ఏమాత్రం స్పందిస్తున్నారని చూస్తే మాత్రం నిరాశ కలగదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒకరిద్దరు మాత్రమే స్పందించారు. ఇక ప్రముఖ హీరోలు దర్శకులు నిర్మాతలు అడ్రస్ లేరు. ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే.. లేదా బాలు గురించి ఆందోళన వ్యక్తం చేస్తే.. ఆయన కోసం ప్రార్థించమని అంటే.. ఆయన కోలుకునేస్తారా.. అని అంటే అనొచ్చేమో. కానీ ఈ విషయంలో తమిళ సెలబ్రెటీలకు తెలియదు. తన పాటలతో తమిళ సినిమాకు అపారమైన సేవ చేసి తమకెంతో ఆనందాన్నిచ్చిన దిగ్గజం పట్ల తమకెంత కన్సర్న్ ఉందని.. ఆయన్ని తామెంతగా అభిమానిస్తాం గౌరవిస్తాం అన్నది వాళ్లు చూపిస్తున్నారు.

కానీ తెలుగువాడై ఉండి.. మన సినిమాకు మన భాషకు మన ప్రాంతానికి మన ఉనికికి ఎంతో పేరు తెచ్చి.. మనకెంతో ఆనందాన్నిచ్చిన దిగ్గజం గురించి మన వాళ్లకే పట్టింపు లేకపోయింది. మన భాష మన సంస్కృతి మన దిగ్గజాలు అంటే తెలుగు వాళ్లకు ఎప్పుడూ చిన్నచూపే. అది మరోసారి రుజువైంది. ఫిలిం సెలబ్రెటీలనే కాదు.. మన రాజకీయ నాయకులదీ ఇదే వరస. తమిళనాడు ప్రభుత్వం బాలు ఆరోగ్యాన్ని కాపాడటం తమ బాధ్యతగా తీసుకుని ఆయన చికిత్సకయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. నిజానికి ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని ఉండాల్సింది. ఆ బాధ్యత తీసుకోకపోయినా.. కర్టసీకి అయినా వాళ్లు బాలు ఆరోగ్యం గురించి వాకబు చేయడం కుటుంబ సభ్యులతో మాట్లాడటం లాంటివి చేయాలి? అలా చేస్తున్నారా అన్నది సందేహమే. ఇదీ ఒక దిగ్గజం పట్ల మనందరం వ్యవహరిస్తున్న తీరు.