ఎట్టకేలకు ఓటీటీ ప్రీమియర్ కు నిశ్శబ్ధం..?

0

థియేటర్ల స్థానాన్ని డిజిటల్ ఆక్రమిస్తోంది. ఓటీటీల ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. ఇటీవల వరుసగా క్రేజీ స్టార్లు నటించిన సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడంతో ఈ వేదికపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. మొన్న నాని- సుధీర్ బాబు నటించిన `వి` అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఈ సీజన్ లో ఓటీటీలోకి వచ్చిన పెద్ద సినిమా ఇదే.

ఆ తర్వాత రాబోతున్న సినిమా `నిశ్శబ్ధం`. అనుష్క – మాధవన్ జంటగా నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో నేరుగా విడుదల చేయబోయే తదుపరి పెద్ద టాలీవుడ్ చిత్రమని ప్రచారమవుతోంది. నిజానికి డిజిటల్ లోకి రావాల్సిన మొదటి చిత్రం ఇదే కావాల్సింది. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమవ్వడంతో ఇంత లేటయ్యింది.

నిశ్శబ్ధం డిజిటల్ రిలీజ్ సరైనదా థియేట్రికల్ రిలీజ్ సరైనదా? అంటూ నిర్మాత కం రచయిత కోన వెంకట్ ఆడియెన్ నే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారట. ఈ మూవీలో అనుష్క మ్యూట్ క్యారెక్టర్ లో నటించగా.. అమెరికా నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రక్తి కట్టించనుందని సమాచారం. అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదల షెడ్యూల్ ప్రకారం ఇది అక్టోబర్ 10 లేదా అక్టోబర్ 17 న ప్రదర్శిస్తారు. ఈ ప్రకటన అధికారికమైన తర్వాత తాజా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.