MAA ఎన్నికల వార్: విష్ణు బాంబ్ విసిరాక ఇతరుల్లో ఉలుకు పలుకు లేదేం?

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల హంగామా చూస్తున్నదే. 2021 సెప్టెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎవరికి వారు రాజకీయాలు చేస్తూ ఈసారి సీన్ ని మరింతగా వేడెక్కించేస్తున్నారు. `మా` అధ్యక్ష పదవి కోసం ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నా ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్యనే హోరాహోరీ ఉంటుందని ప్రచారమవుతోంది.

ప్రకాష్ రాజ్ వర్గానికి వ్యతిరేకంగా వీకే నరేష్ ప్రచారం హీటెక్కిస్తున్నారు. నరేష్.. జీవిత ఈసారి అసోసియేషన్ కి మహిళాధ్యక్షురాలు కావాలని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగానే సినీ పెద్దలు ఏకగ్రీవం చేసేందుకు ఆలోచిస్తున్నారని మరో ప్రచారం ఊపందుకుంది. ఈసారి మా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించకుండా ఎవరో ఒక హుందా అయిన అధ్యక్షుడిని ఎంపిక చేసి ఈసీ కమిటీని నియమించాలని చిరంజీవి- మోహన్ బాబు- మురళీమోహన్ తదితరులతో కూడుకున్న సినీపెద్దల బృందం ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

అయితే ఇంతటి ప్రచారం సాగుతున్నా ప్రకాష్ రాజ్ కానీ.. మంచు విష్ణు కానీ ఏ విషయంలోనూ తగ్గలేదు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే పూరి కేవ్ లో తన మద్ధతుదారులతో మంతనాలు సాగిస్తున్నారని లీకుల వల్ల ఫిలింనగర్ లో అద్దె ఆఫీస్ తీసుకున్నారని కథనాలొచ్చాయి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఆర్టిస్టులతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు నిన్నటిరోజున ఆకస్మిక ప్రకటన తో బిగ్ బాంబ్ విసిరారు. ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యే ప్రకటన ఇది.

`మా` రాజకీయాలన్నీ సొంత భవంతి నిర్మాణం చుట్టూనే తిరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు స్వయంగా బరిలో దిగి మా భవంతి నిర్మాణానికి అవసరమయ్యే ప్రతి పైసా తానే ఖర్చు చేస్తానని ప్రకటించి షాకిచ్చారు. సినీపెద్దలు ఎవరినైనా ఏకగ్రీవం చేస్తే దానికి మద్ధతునిస్తానని లేని పక్షంలో అధ్యక్ష పదవికి పోటీపడతానని మంచు విష్ణు ప్రకటించారు. అయితే విష్ణు కామెంట్ తర్వాత దీనిపై ఎవరూ స్పందించలేదు ఎందుకనో. ఇండస్ట్రీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అధ్యక్ష పదవి రేసులో ఉన్నవాళ్లలో ఎవరూ ఇంతవరకూ స్పందించనేలేదు.

అసలు ఇండస్ట్రీ నుంచి ఉలుకు పలుకు లేనే లేకపోవడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. మిగిలిన ఐదుగురి నుంచి అస్సలు స్పందనే లేదేమిటో! ఇప్పటివరకూ ప్రధాన పోటీదారు ప్రకాష్ రాజ్ దీనిపై స్పందించలేదు. ఒకవేళ తాను అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు కాబట్టి ప్రకాష్ రాజ్ స్వయంగా మా సొంత భవంతిని నిర్మించేందుకు అవసరమైన నిధిని తానే ఇస్తానని అంటారా? లేక విష్ణుపై ఇంకేవైనా కౌంటర్లు వేస్తారా? అంటూ ఆర్టిస్టుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి మా సొంత భవంతి నిర్మాణం అన్నివేళలా అందరి దృష్టినీ ఆకర్షించే ఎలిమెంట్. టాలీవుడ్ ఎనిమిది దశాబ్ధాలు పైగా మనుగడ సాగించినా ఇంకా అంత పెద్ద అసోసియేషన్ కి ఒక సొంత భవంతి లేకపోవడాన్ని అవమానంగా చేతకానితనంగా భావిస్తున్నారు. సినీతారలు పేదరికంలో ఉన్నారా? పెద్దలే డబ్బు పెట్టి ఒక భవంతిని నిర్మించవచ్చు కదా! తాము తలుచుకుంటే ఇదేమంత కష్టమా? అంటూ రకరకాల వాదనలు తెరపైకొచ్చాయి.

కానీ ఇప్పుడు ఎవరి సహాయం అవసరం లేకుండా మంచు విష్ణు తానే మా సొంత భవంతిని నిర్మిస్తానని ప్రకటించారు. మరి ఎవరూ అతడికి పోటీ ప్రకటన చేయలేదు కాబట్టి తననే ఇతర సభ్యులు ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తారా? లేదూ ఏకగ్రీవం చేసేస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకే ఒక్క ప్రకటనతో విష్ణు ఎన్నికల్లో ఫ్రంట్ రన్నర్ గా దూసుకొచ్చారు. ఇంతకీ విష్ణు ప్రకటన ముందు అందరూ తల దించుకున్నట్టేనా? మునుముందు `మా` ఎన్నికల రాజకీయం ఇంకెంత రసవత్తరంగా మారనుందో వేచి చూడాలి.