ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ ..

0

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారణ ప్రారంభించి పలువురిని అరెస్ట్ చేశారు. ఇక డ్రగ్స్ కేసులో ఇవాళ రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఎన్సీబీ విచారణకు వచ్చిన రియాను మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆమె ఇబ్బందికి గురయ్యారు. కనీసం ముందుకు కదలలేని పరిస్థితుల్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఈ ఘటనపై మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఓ స్త్రీ పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

కాగా మంచు లక్ష్మి ట్వీట్ లో ”ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ. ఓ మహిళతో వ్యవహరించాల్సిన విధానం ఇది ఎంతమాత్రం కాదు. మనం మరొకరి పట్ల ఇంత భయంకరంగా ఎలా ఉండగలము? ఓ మనిషి పట్ల ఎలాంటి గౌరవం చూపకుండా దారుణంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితి చూడటం చాలా హృదయ విదారకం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకముందు కూడా మంచు లక్ష్మి రియా కు మద్ధతు తెలుపుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. మీడియా ఓ అమ్మాయిని భూతంగా చూపిస్తోందని.. న్యాయ వ్యవస్థలపై నమ్మకముంచి నిజానిజాలు బయటపడే వరకు ఆమెను వదిలేయాలని కోరింది. ఇప్పుడు మరోసారి రియాకు బాసటగా నిలుస్తూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు రియా పై నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది రియా పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.