నాగ్ ‘వైల్డ్ డాగ్’ కోసం బాలీవుడ్ హీరో తండ్రి స్టంట్స్…!

0

టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”వైల్డ్ డాగ్”. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ప్రధాన తారాగణంతో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతంలో జరుగుతోంది. దాదాపు 13వేల అడుగుల ఎత్తులో డేంజరస్ ప్రాంతంలో షూటింగ్ జరుపుతున్నామని.. 21 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని నాగార్జున ఓ వీడియో ద్వారా తెలియజేసాడు. అయితే ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ టీమ్ లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ కూడా భాగమయ్యారని తెలుస్తోంది.

స్టంట్ మాస్టర్ అయిన శామ్ కౌశల్ ఆధ్వర్యంలో ‘వైల్డ్ డాగ్’ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రికరిస్తునట్లు తెలుస్తోంది. మనాలి షూటింగ్ లో పాల్గొన్న విషయాన్ని శామ్ కౌశల్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ‘మనాలిలోని రోహతంగ్ పాస్ లో జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో దేవుడి దయ వలన షూటింగ్ జరుగుతోంది. ఈ సీజన్ లో ఇక్కడ మంచు పడటం ప్రారంభమయ్యింది’ అని శామ్ పోస్ట్ పెట్టారు. కాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మీర్జా – సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది.