బిబి4 : పుకార్లన్నింటికి చెక్ పెట్టేసిన నాగ్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గడచిన ఆదివారం ఎపిసోడ్ కు హోస్ట్ గా సమంత వ్యవహరించిన విషయం తెల్సిందే. నాగార్జున మూడు వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం మనాలీలో ఉండబోతున్నాడని మరో రెండు వారాల పాటు కూడా సమంత లేదా మరెవ్వరైనా గెస్ట్ హోస్ట్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని తాజాగా నాగార్జున ఆ వార్తలన్నింటికి చెక్ పెట్టాడు. నేడు సాయంత్రంకు నాగార్జున హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు బిగ్ బాస్ షో షూటింగ్ లో పాల్గొని వెంటనే షూటింగ్ కోసం మనాలీ వెళ్లి పోనున్నాడు.

గత వారం కూడా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల నాగార్జున రాలేక పోయాడు. దాంతో చివరి నిమిషంలో దసరా స్పెషల్ ఎపిసోడ్ గా నాగార్జునకు బదులుగా సమంతను రంగంలోకి దించారు. సమంత ఎపిసోడ్ కు మంచి స్పందన వచ్చినప్పటికి ఆమె కంటిన్యూ చేసేందుకు ఆసక్తిగా లేదు. షో ను ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండానే దసరా రోజు సండే స్పెషల్ ఎపిసోడ్ ను హోస్ట్ చేసింది. తనకు ధైర్యం చాలకున్నా మామయ్య చెప్పడంతో చేయాల్సి వచ్చిందన్న సమంత సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పి మళ్లీ బిగ్ బాస్ కు హోస్ట్ గా చేయబోను అంటూ చెప్పకనే చెప్పింది. ఈవారం వారు వీరు అంటూ పుకార్లు షికార్లు చేసినా కూడా రేపటి ఎపిసోడ్ కోసం స్వయంగా నాగ్ రంగంలోకి దిగబోతున్నాడు. ప్రత్యేక విమానంలో నాగార్జున హైదరాబాద్ చేరుకున్నట్లుగా స్టార్ మా మరియు మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.