‘కులం కారణంగా నా సొంత ఊర్లో ఇప్పటికీ నన్ను చిన్నచూపు చూస్తున్నారు’

0

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సపోర్టింగ్ రోల్స్ తపో కెరీర్ స్టార్ట్ చేసిన నవాజుద్దీన్.. ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తున్నాడు. విభిన్నమైన చిత్రాల్లో విలక్షమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో ఉండేలా చూసుకుంటూ ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తూ.. తాను మాత్రమే ఆ పాత్ర చేయగలడు అనే విధంగా తెరపై అద్భుతాన్ని సృష్టిస్తాడు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘రాత్ అఖేలీ హై’ ‘సీరియస్ మ్యాన్’ సినిమాలలో తన అద్భుతమైన నటనతో మరోసారి మ్యాజిక్ చేశాడు. ఇంతటి ఖ్యాతి సంపాదించుకున్న ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన నవాజుద్దీన్ సిద్దిఖీని కులం కారణంగా తన స్వంత గ్రామంలో ఇప్పటికీ చిన్నచూపు చూస్తారని చెప్తున్నాడు.

నవాజుద్దీన్ సిద్దిఖీ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కుల వివక్షపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై స్పందించారు. హత్రాస్ ఘటన చాలా దురదృష్టకరంగా అభివర్ణించిన నవాజుద్దీన్.. కుల వ్యవస్థ గ్రామాల్లో లోతుగా కూరుకుపోయిందని.. సినిమాల్లో ప్రాముఖ్యత పొందిన తాను కూడా వివక్ష నుంచి తప్పించుకోలేకపోకపోయానని.. నేను కుల వివక్ష బాధితుడినే అని పేర్కొన్నాడు. ”ఇప్పటికీ సమాజంలో కుల వివక్షత ఉంది. నా కుటుంబంలో మా నానమ్మది తక్కువ కులం. దీంతో ఇప్పటికి కూడా మా గ్రామస్థులు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. మమ్మల్ని వారు ఒప్పుకోవడం లేదు. నేను ఎంత పేరు సంపాదించాను అనేది వాళ్లకు అనవసరం. కులం వారిలో అంత లోతుగా ఇమిడిపోయింది. అది వారి నరనరాలకు వ్యాపించింది. దాన్ని వాళ్లు గౌరవంగా భావిస్తారు. కొందరు కుల వివక్ష లేదని మాట్లాడవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో తిరిగి చూస్తే రియాలిటీ తెలుస్తుంది” అని నవాజుద్దీన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల అతను నటించిన ‘సీరియస్ మ్యాన్’ సినిమాలో దళితుడిగా నటించాడు. తన కొడుకు సైన్స్ జీనియస్ అని అబద్ధం చెప్పే దళిత తండ్రి పాత్రలో నవాజుద్దీన్ అద్భుతంగా నటించాడు.