‘ఆచార్య’ కు ఆదినుంచి అవాంతరాలేనా…?

0

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ”ఆచార్య”. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే ‘ఆచార్య’ సినిమా మీద మొదటి నుంచి నెగిటివ్ ప్రభావం ఉన్నట్లుగా అనిపిస్తోందని మెగా అభిమానులు కలవరపడుతున్నారు.

కాగా ‘ఆచార్య’ సినిమా కోసం కొరటాల శివ ఇప్పటికే చాలా సమయం కేటాయించాడు. ‘భరత్ అనే నేను’ సినిమా కంప్లీటైన తర్వాత చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పూర్తయ్యే క్రమంలో కొరటాల సుమారు ఏడాది కాలం వెయిట్ చేసాడు. ఎట్టకేలకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకుంటే హీరోయిన్ కష్టాలు వచ్చి పడ్డాయి. ముందుగా అనుకున్న హీరోయిన్ త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కాజల్ వచ్చి చేరింది. ఆ తర్వాత చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగులో బిజీగా ఉండి ‘ఆచార్య’కి డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఇంతలోనే కరోనా మహమ్మారి వచ్చి షూటింగ్ జరగనియ్యకుండా అడ్డుపడింది.

ఇక కొరటాల శివ ఓ సినిమా కంప్లీట్ చేసిన తరువాత మరో సినిమాకి సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తూ ఉంటారు. కానీ ‘ఆచార్య’ ఇంకా సెట్స్ పైకి ఉండగానే బన్నీతో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశాడు. దీనికి తోడు ఇప్పుడు ‘ఆచార్య’ కథ నాదే అంటూ ఆరోపణలు చేస్తూ ఇద్దరు రైటర్స్ రచ్చకెక్కారు. మరోవైపు కరోనా ప్రభావం మళ్ళీ ‘ఆచార్య’ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో అనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’కి మొదటి నుంచి ఏదొక అంతరాయం కలుగుతూనే ఉన్నాయని ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇలా అవాంతరాలు దాటుకుంటూ.. డిలే అవుతూ వచ్చిన సినిమాలు చాలా వరకు నిరాశ పరుస్తాయనే బ్యాడ్ సెంటిమెంట్ ఉందని.. ‘ఆచార్య’ విషయంలో ఆ బ్యాడ్ సెంటిమెంట్ నిజం కాకూడదని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.