ఆయనే నా తొలి గురువు.. తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం : పవన్ కళ్యాణ్

0

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవికి ఆయన అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో చిరు 65వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకి విషెస్ చెప్పారు. జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

”అన్నయ్య చిరంజీవి నాకు స్ఫూర్తి ప్రదాత. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంతలా ఆరాధిస్తానో పూజ్యులైన అన్నయ్యను కూడా అంతే ప్రేమిస్తాను. నా అన్నయ్య వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఆయనే నాకు తొలి గురువు. అన్నయ్య ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఆవిర్భవించారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమనులు శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించారు. ఆయనలా నటుడవుదామని ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే ఆయన సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు. ఎందరికో స్ఫూర్తినిచ్చి ఆపన్నులకు అండగా ఉన్న మీలాంటి కృషి వలునికి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. మీరు చిరాయువుతో సుఖ శాంతులను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ అన్నయ్యకు ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.