రిస్క్ వద్దనుకుంటున్న ప్రభాస్

0

ప్రభాస్ బాహుబలి.. సాహో సినిమాలతో పాటు ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకు కూడా ఏళ్లకు ఏళ్లు తీసుకున్నాడు ఇంకా తీసుకుంటూనే ఉన్నాడు. అయితే తదుపరి సినిమాలకు మాత్రం ఇంత సమయం తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఉన్నాడట. అందుకే రాధేశ్యామ్ ఇంకా సెట్స్ పై ఉండగానే నాగ్ అశ్విన్ మూవీతో పాటు ఆదిపురుష్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఈ మూడు సినిమాలను ఏక కాలంలో చేయాలని ప్రభాస్ మొదట భావించాడు. కాని మూడు సినిమాలు కలిపి వెయ్యి కోట్లకు పైబడిన బడ్జెట్ తో రూపొందుతున్నాయి. కనుక ప్రయోగం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగానే చేయాలనే నిర్ణయానికి వచ్చాడట.

రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మొదట అనుకున్నట్లుగా ఆదిపురుష్ షూటింగ్ షూటింగ్ సగం పూర్తి అయిన వెంటనే నాగ్ అశ్విన్ మూవీని పట్టాలెక్కించాలనుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం ఆది పురుష్ పూర్తిగా షూటింగ్ అయిన తర్వాతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. అందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేలా మేకర్స్ ను కోరాడట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం పర్వాలేదు కాని ఏక కాలంలో రెండు మూడు సినిమాలు చేయడం వల్ల దృష్టి పెట్టడం ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని ప్రభాస్ భావించాడట.

ఆ కారణం వల్ల నాగ్ అశ్విన్ మూవీ అనుకున్న సమయం కంటే రెండు మూడు నెలలు ఆలస్యంగా ఆరంభం కాబోతుంది. ఆలస్యంగా ప్రారంభం అయినా 2022లో మాత్రం ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక ప్రస్తుతం యూరప్ లో చిత్రీకరన జరుపుకుంటున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చ ఏడాది ద్వితీయార్థంలో రాధేశ్యామ్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి రాబోయే రెండేళ్లు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే పండుగ.