చిరుత కాంబినేషన్ రిపీటవుతోందా?

0

రెండు దశాబ్ధాల క్రితం రామ్ చరణ్ ని వెండితెరకు పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ చిరుత (2007) చిత్రాన్ని తెరకెక్కించారు. ఆరంగేట్రమే కమర్షియల్ హీరోగా చెర్రీని పూరి ఎలివేట్ చేసిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత చరణ్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణించగా.. పూరి స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్ని అందించారు.

ప్రతిసారీ కెరీర్ గ్రాఫ్ డౌన్ అయ్యే సన్నివేశంలో బ్లాక్ బస్టర్ తో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు పూరి. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరి పూర్తిగా బిజీ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నాడు. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.

దీంతో పాటు పూరి జగన్నాధ్ త్వరలో ఒక బాలీవుడ్ చిత్రం చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. పూరి జగన్నాథ్ కు మెగా క్యాంప్ నుండి పిలుపు అందిందని సమాచారం. ప్రస్తుతం అతడికి పలువురు చిత్రనిర్మాతల నుండి అవకాశాలొచ్చాయి. రామ్ చరణ్ మళ్ళీ పూరి జగన్నాధ్ తో కలిసి పనిచేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నాడని.. చిరుత కలయికను మళ్ళీ రిపీట్ చేయాలని పలువురు చిత్రనిర్మాతలు భావిస్తున్నారట. పూరి కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట.

లాక్ డౌన్ లో పూరి జగన్నాధ్ అనేక స్క్రిప్ట్ లను రాశారు. చరణ్ కు సరిపోయే ది బెస్ట్ ఒకటి అందులోంచి ఎంచుకుంటున్నారట. అన్నీ సరిగ్గా జరిగితే పూరి అతి త్వరలో చరణ్ ని డైరెక్ట్ చేస్తారు. చిరుత కాంబో లో అదిరిపోయే సినిమా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.