కేరళ నుండి మహబూబ్ నగర్ కు షిప్ట్ అయిన పుష్ప

0

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప’ ను ప్రారంభించాలని అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి మొదలైన విషయం తెల్సిందే. గత అయిదు ఆరు నెలలుగా పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే పుష్ప చిత్ర షూటింగ్ దాదాపుగా సగం వరకు పూర్తి అయ్యి ఉండేది. మొదటి షెడ్యూల్ ను కేరళలోని అడవిలో ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ఒకటి రెండు వారాల్లో వెళ్తారు అనగా కరోనా ప్రారంభం అయ్యింది.

అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ ను మొదలు పెట్టాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేరళ వెళ్లి చిత్రీకరణ జరుపుకుని రావడం కాస్త రిస్క్ తో కూడుకున్న విషయం. అందుకే ఆ రిస్క్ లేకుండా ఇక్కడే చిత్రీకరణ పూర్తి చేయాలనే నిర్ణయానికి సుకుమార్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఏపీ మరియు తెలంగాణలోని పలు చోట్ల ఈ షూటింగ్ నిర్వహించబోతున్నారట.

మొదటగా మహబూబ్ నగర్ లో ఉన్న ఫారెస్ట్ లో షూటింగ్ జరుపబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో యూనిట్ సభ్యులు మునిగి పోయారు. ఇప్పటికే అల్లు అర్జున్ గెటప్ తో రెడీగా ఉన్నాడు. సుకుమార్ ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అంటూ ఆయన ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ హాట్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించబోతున్నారట. సినిమాను వచ్చే యేడాది సమ్మర్ తర్వాత విడుదల చేయబోతున్నారు.