డ్రగ్ కేసు లో హీరోయిన్లకు బెయిల్ నిరాకరించిన హైకోర్ట్..!

0

శాండిల్ వుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర సీమలో అనేకమంది నటీనటులు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో హీరోయిన్స్ రాగిణి ద్వివేది – సంజన గల్రాని లతో పాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురుని సీసీబీ అరెస్టు చేసింది. అయితే రాగిణి ద్వివేదీ – సంజనా గల్రానీలకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రొడ్యూసర్ శివ ప్రకాష్ పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ తో పాటు మరో నలుగురి పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఇంతకముందు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానం రాగిణి – సంజనా లకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. అలానే ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివ ప్రకాష్ – వినయ్ కుమార్ ల ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వీరంతా కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టులో కూడా వీరికి చుక్కెదురైంది.

కాగా డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు. అదే క్రమంలో హీరోయిన్ సంజన గల్రానికి కూడా డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందని గుర్తించి సెప్టెంబర్ 9న ఆమెను అరెస్ట్ చేశారు. వీరితో పాటు రాహుల్ – వీరేన్ ఖన్నా – రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం రాగిణి – సంజనా – డ్రగ్ సప్లయర్ ప్రశాంత్ రాంకా బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో నిర్మాత శివ ప్రకాష్ ఆచూకీ మాత్రం ఇంకా పోలీసులకు దొరకలేదు. అలానే డ్రగ్స్ కేసులో మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆల్వా కొడుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావ మరిది ఆదిత్య ఆల్వాని కూడా నిందితుడిగా గుర్తించారు. ఆదిత్య కోసం ఇప్పటికే వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సీసీబీ అధికారులు సోదాలు చేశారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆదిత్య అల్వా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.