రామ్ ‘రెడ్’ నాన్ థియేట్రికల్ బిజినెస్ సరిగా జరగడం లేదా..?

0

యువ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ”రెడ్”. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. రామ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రామ్ ‘రెడ్’ సినిమా కోసం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పోటీపడి ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేశాయని వార్తలు వచ్చాయి. అయితే రామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్.. ‘రెడ్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ని కొల్లగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే రామ్ ‘రెడ్’ సినిమాకి ఆశించిన స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. హిందీ రైట్స్ విషయంలో రామ్ కి మంచి మార్కెట్ ఉంది. రామ్ నటించిన సినిమాలు హిందీలో డబ్ చేసి విడుదల చేస్తే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తుంటాయి. అందుకే రామ్ సినిమాల హిందీ రైట్స్ దాదాపుగా 8 కోట్ల వరకు పలుకుతామని సమాచారం. అయితే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల హిందీ మార్కెట్ పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామ్ ‘రెడ్’ హిందీ రైట్స్ కేవలం 3 కోట్లకి అడుగుతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ 13 కోట్లకి జరిగిందట. ఇదే కనుక నిజమైతే ‘రెడ్’ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కలుపుకుంటే 16 కోట్లకి మించడం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ మొత్తం కలిపి 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అందులో నాన్ థియేట్రికల్ బిజినెస్ సుమారు 25 కోట్ల వరుకు ఉండొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే రామ్ ‘రెడ్’ దాదాపు 9 కోట్లు డెఫిషిట్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి సంక్రాంతి రేసులో నిలవనున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.