రిలీజ్ టార్గెట్ : 2021 దసరా లేదా 2022 సంక్రాంతి?

0

అయితే అమావాస్యకు కుదరకపోతే పౌర్ణమికి అన్నట్టే ఉంది వాలకం. ఫలానా తేదీకి ఫలానా సినిమా రిలీజవుతుంది అని చెప్పలేని దుస్థితి ఎదురవుతోంది. కరోనా మహమ్మారీ అంతా మార్చేసింది. ఎంతో తెగింపుతో అగ్ర హీరోలంతా బయటకు వచ్చి షూటింగులు చేస్తున్నా అడపా దడపా కొన్ని చెదురుముదురు ఘటనలు భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 60 ప్లస్ హీరోలకు ఇదో సంకటంగా మారింది.

ఇప్పటికిప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య వచ్చే జనవరి రేసు నుంచి తప్పుకుని సమ్మర్ కి వాయిదా పడిందని ప్రచారమైంది. కానీ అప్పటికి కూడా కష్టమేనని ఇటీవలి మరో వాయిదా వల్ల దసరా వరకూ రావడం కుదరదన్న గుసగుసా వేడెక్కిస్తోంది. మరోవైపు రాధే శ్యామ్ ని శరవేగంగా ముగించాలనుకున్న ప్రభాస్ కి చిక్కులు తప్పడం లేదు. ఏదీ వేగంగా పూర్తవ్వడం లేదు. ఈ మూవీ లాంగ్ షెడ్యూల్ ఇంకా పెండింగ్ పడడంతో అది పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారట. అంటే సమ్మర్ రేసు నుంచి తప్పుకుని ఈ మూవీ కూడా దసరాకే వచ్చే వీలుందన్న గుసగుసా వినిపిస్తోంది.

మరోవైపు దసరా రేసులో పోటీపడతారనుకున్న మహేష్ – బన్ని మరోసారి సంక్రాంతి 2022 వరకూ వేచి చూడాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పుష్ప షెడ్యూల్ మొదలైనా సర్కార్ వారి పాట షెడ్యూల్ జనవరి నుంచి మొదలు కావాల్సి ఉంది. ఇవి రెండూ 2022 దసరాకి వచ్చేస్తాయని భావించినా కష్టమేనన్నది తాజా గుసగుస. అందుకే ఆ ఇద్దరూ మరోసారి సంక్రాంతికి పోటీపడే వీలుందని భావిస్తున్నారు. 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు వర్సెస్ అల వైకుంఠపురములో వార్ గురించి తెలిసిందే. అలాంటి సన్నివేశం 2022లోనూ రిపీటవుతుందని గెస్ చేస్తున్నారు. అంతా మహమ్మారీ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది.