టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ..!

0

టాలీవుడ్ కో ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోయిన్స్ తెచ్చుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. స్టార్ హీరోల సినిమాల కోసం ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీస్ ని తీసుకొస్తుంటారు. వాళ్ళు డేట్స్ ఇస్తామంటే డిమాండ్ చేసినంత ముట్టజేప్పడానికి కూడా మేకర్స్ రెడీగా ఉంటారు. అందులోనూ తెలుగు సినిమాల స్థాయి ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో పాకడంతో బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో అలియా భట్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అలానే ప్రభాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునే ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. ఇక పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో మరో బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో రూపొందనున్న ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించనుందట. సోనమ్ టాలీవుడ్ డెబ్యూ మూవీ ఓ స్టార్ హీరోతో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇంతకముందు తెలుగు సినిమాల్లో సోనమ్ కపూర్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇన్నాళ్లకు అమ్మడు తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్.. స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. వివాహం తర్వాత కూడా కెరీర్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వస్తోంది. మరి ఇప్పుడు ఈ బ్యూటీని తెలుగులో ఎవరు లాంఛ్ చేస్తున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.