అలా జరిగినందుకు అస్సలు ఫీల్ కావట్లేదన్న రిచా

0

గ్లామర్ ఫీల్డ్ లోకి రావటం.. గుర్తింపు పొందటం.. వరుసగా అవకాశాలు లభించటం.. కెరీర్ బాగానే ఉందన్న వేళ.. చెప్పాపెట్టాకుండా వెళ్లిపోవటం లాంటివి సాధ్యమా? అంటే.. ఇవన్నీ అయితే కష్టమే అంటారు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే. కానీ.. రిచా గంగోపాధ్యాయ అందుకు మినహాయింపు. తొలి మూవీనే రానా దగ్గుబాటితో మూవీ చేయటం.. దానికి శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయటం లాంటి బంపర్ ఆఫర్ కొట్టేసింది.

ఆ తర్వాత బాయ్.. మిరపకాయ్ తదితర సినిమాల్లో నటించటమే కాదు.. తమిళ్ లోనూ అవకాశాల్ని అందిపుచ్చుకుంది. అలా స్టార్ హీరోలతో నటిస్తున్న వేళ.. ఉన్నట్లుండి తన దారిన తాను వెళ్లిపోయింది. ఎందుకు వెళ్లిపోయిందో? ఎక్కడికి వెళ్లిపోయిందో చాలామందికి తెలీదు. తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుందన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తమిళ్ లో ధనుష్ సరసన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేసిన మయక్కం ఎన్నా అనే మూవీ ఆమె నటించిన ఆఖరిది. ఆ సినిమా మాంచి విజయాన్ని సాధించి రిచాకు చక్కటి పేరును తెచ్చింది.

అయినప్పటికీ.. సినిమా ఇండస్ట్రీని వదిలేసి.. ఫారిన్ వెళ్లిపోయింది. ఆ సినిమా విజయవంతం గురించి తాజాగా పలువురు అభినందనలు తెలియజేశారు. తొమ్మిదేళ్లు అయిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో.. ఆమె స్పందించింది. తాను సినిమాల్ని ఎందుకు వదిలేసిందో వెల్లడించింది. తనకు మార్కెటింగ్ లో ఎంబీఏ చేయాలన్న కల ఉండేదని.. దాన్ని పూర్తి చేసుకునే అవకాశం రావటంతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లినట్లు చెప్పింది.

సినిమాలు వదిలేసి.. చదువుకోవటానికి అదే సరైన సమయమనిపించిందని.. అలా తన రీల్ లైఫ్ కు తెర పడినట్లు చెప్పింది. సినిమాలు వదిలేసినందుకు తానేమీ బాధపడటం లేదని పేర్కొంది. నటిని కావటంతో తాను చాలామంది స్నేహితుల్ని మిస్ అయినట్లు చెప్పింది. ఎంబీఏ చేయటంతో మళ్లీ తనకు స్నేహితులు లభించారన్న ఆమె.. ఆ సమయంలోనే తన క్లాస్ మేట్ అయిన యూఎస్ సిటిజన్.. జీవిత భాగస్వామి లభించాడని వెల్లడించింది. ప్రస్తుతం జీవితం చాలా హ్యాపీగా ఉందన్న ఆమె.. సినిమాలకు దూరమయ్యానన్న బాధ ఏ మాత్రం లేదని చెప్పింది. తనను గుర్తు పెట్టుకొని మరీ.. అభినందించిన తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.