Templates by BIGtheme NET
Home >> Cinema News >> RRR: జక్కన్న అలాంటి ఆలోచన చేస్తున్నాడా..?

RRR: జక్కన్న అలాంటి ఆలోచన చేస్తున్నాడా..?


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్” పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ పాత్రలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఇద్దరి హీరోల ఎంట్రీ వీడియోస్ విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో గాసిప్ వినిపిస్తూనే ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఆయా భాషల్లో ప్రముఖుల చేత వాయిస్ ఓవర్ చెప్పించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ట్రైలర్ కి కూడా పలువురు స్టార్ యాక్టర్స్ వాయిస్ ఓవర్ అందిస్తారని అంటున్నారు.

తెలుగు ట్రైలర్ కి చిరంజీవి.. హిందీ వెర్షన్ కి అమీర్ ఖాన్ గొంతు అరువు ఇవ్వనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా ట్రిపుల్ ఆర్ లో అజయ్ దేవగన్ – శ్రియా – సముద్రఖని – అలియా భట్ – ఒలీవియా మోరిస్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.