తిరుపతి షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వానంద్ ‘శ్రీకారం’

0

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బి.కిశోర్రెడ్డి దర్శకత్వంలో ”శ్రీకారం” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట – గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. ఇందులో శర్వానంద్ యువ రైతు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ని అక్టోబర్ 2న తిరుపతిలో తిరిగి ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో చిత్ర యూనిట్ షూటింగ్ జరిపింది. ప్రధాన తారాగణంతో షూట్ జరిపి తిరుపతి షెడ్యూల్ పూర్తి చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్రీకరణలో పాల్గొన్న నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. “లార్డ్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ సజావుగా సాగింది. శర్వానంద్ – ప్రియాంక అరుల్ మోహన్ – నరేష్ – రావు రమేష్ – సాయి కుమార్ – సత్య – సప్తగిరి – ఆమని మరియు మరికొందరు నటీనటులు ఇందులో పాల్గొన్నారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాట చిత్రీకరించబడింది. నటీనటులు టెక్నీషియన్స్ మరియు సిబ్బంది అపారమైన కృషి అంకితభావానికి ధన్యవాదాలు. వీరి సహకారం లేకుండా ఈ మహమ్మారి సమయంలో ఇది సాధ్యం కాదు” అని ‘శ్రీకారం’ మేకర్స్ పేరొన్నారు.

కాగా ‘గడ్డలకొండ గణేష్’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో వస్తున్న సినిమా ‘శ్రీకారం’. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జె యువరాజ్ మరియు ఆర్ట్ అవినాష్ కొల్లా. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ – సాయికుమార్ – మురళి శర్మ – రావు రమేష్ – ఆమని – సత్య – సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.