బాలీవుడ్ బ్యూటీ డిమాండ్ తో షూటింగ్ లొకేషన్ మారిపోయింది…!

0

కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయి కళ తప్పిన సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు నూతనోత్సాహం మొదలైంది. మహమ్మారికి భయపడి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా సెట్ లో అడుగుపెట్టడానికి ధైర్యం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ షూటింగ్ కోసం ఇటీవల స్కాట్లాండ్ వెళ్ళాడు. అక్షయ్ డేర్ చేసాడు కానీ చాలామంది స్టార్స్ కేవలం ఇండోర్ షూటింగ్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్స్ కోసం స్క్రిప్ట్ ని కూడా చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే అవుట్ డోర్ షూటింగ్ కి రాలేనని చెప్పడంతో ఆమె నటిస్తున్న సినిమా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.

కాగా దీపికా పదుకుణే – అనన్య పాండే ప్రధాన పాత్రలతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘కపూర్ అండ్ సన్స్’ డైరెక్టర్ షకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చిలో ప్రారంభమై కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలతో ఈ నెల రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. కాకపోతే మొదట శ్రీలంకలో అనుకున్న షెడ్యూల్ ఇప్పుడు గోవాకు మారింది. దీపికా పదుకుణే షూటింగ్ సెట్ లో సందడి చేయడానికి రెడీ అయినప్పటికీ శ్రీలంకలో షూటింగ్ అయితే రాలేనని చెప్పిందట. దీంతో ఈ స్టోరీ నేపథ్యాన్ని మార్చేసి గోవాలో చిత్రీకరణ పెట్టుకుంటున్నారట. అయితే ఇది కేవలం దీపికా విషయంలోనే కాకుండా స్టార్స్ నటిస్తున్న చాలా సినిమాల విషయంలో జరుగుతోందని తెలుస్తోంది.