సిద్ధు – శ్రద్ధ శ్రీనాధ్ కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’

0

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తమ బ్యానర్ లో రూపొందనున్న 10వ చిత్రాన్ని ప్రకటించింది. సిద్ధు జొన్నలగడ్డ – శ్రద్ధ శ్రీనాధ్ హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి ”నరుడి బ్రతుకు నటన” అనే పేరుని ఖరారు చేసారు. వీరిద్దరూ కలసి నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంతో ఇటు టాలీవుడ్ లోను అటు ప్రేక్షకుల్లోనూ టాలెంటెడ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

కాగా ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ ని ఖరారు చేస్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఆకర్షణీయమైన ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో సినిమా టైటిల్ లోగో తోపాటు ఆకర్షణీయమైన ఉత్సుకతను కలిగించే చిత్రం కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో హెడ్ ఫోన్స్ చూపించడం ద్వారా సంగీతానికి ఈ చిత్రకథకు సంబంధం ఉందన్నట్లు తెలుస్తోంది. అలానే హృదయం రూపంలో ఓ జంట ఈ లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం చూస్తే మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఉండబోతోందా అనిపిస్తుంది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు? ప్రేమ కథకు మించి ఈ చిత్రంలో ఇంకేమైనా ఉందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి సాయిప్రకాష్ ఉమ్మడి సింగు ఛాయాగ్రహణం అందిస్తుండగా కాలభైరవ సంగీతం సమకూర్చనున్నాడు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దీపావళికి ప్రారంభం కానుంది.