మెగా మూవీ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నారా?

0

ఏడు నెలలుగా థియేటర్లు మూత పడే ఉన్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అక్టోబర్15 నుండి థియేటర్ల తెరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల కావాలనుకున్న సినిమాలు మళ్లీ థియేటర్ బాట పట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓటీటీలో వచ్చిన పెద్ద సినిమాల్లో ఒకటి రెండు మినహా ఏవీ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ప్రేక్షకులు చాలా సినిమాల విషయంలో పెదవి విరిచారు.

ముఖ్యంగా తెలుగు సినిమాలైన వి మరియు నిశబ్దం సినిమాలు తీవ్ర నిరాశ పర్చాయి. ఆ సినిమాలు అమెజాన్ ద్వారా వచ్చి ఫ్లాప్ టాక్ ను దక్కించుకున్నాయి. దాంతో ఇతర సినిమాలు ఏవీ కూడా ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపడం లేదు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సోబెటర్ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారని.. పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తేజూ తన సినిమాతో థియేటర్లలోనే సందడి చేయబోతున్నాడు.

ఇప్పటికే చేసుకున్న ఒప్పందంను క్యాన్సిల్ చేసుకున్నారంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జీ5 వారితో సోలో బ్రతుకే సో బెటర్ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. మొదట కొన్ని రోజులు పే పర్ వ్యూ పద్దతిన స్ట్రీమింగ్ చేసే విషయమై కూడా చర్చలు జరిగాయి. చివరకు థియేటర్ల ఓపెన్ కు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం మరియు ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల ఫలితాన్ని చూస్తుంటే థియేటర్లలో విడుదల చేయడమే బెటర్ అని మరో నెల రెండు నెలలు ఆగి థియేటర్ల ద్వారానే రావాలనే నిర్ణయానికి మెగా మూవీ మేకర్స్ వచ్చారట.

అతి త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వరుసగా రెండు సినిమాల సక్సెస్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా మరో విజయాన్ని ఆయనకు తెచ్చి పెడుతుందనే నమ్మకంను మేకర్స్ మరియు మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్.