`ఆచార్య`పై కీలకమైన లీకులిచ్చిన విలన్

0

లాక్ డౌన్ సీజన్ దేశంలోనే గొప్ప మనసున్న స్టార్ గా వెలిగిపోయాడు సోనూ సూద్. కోట్లాది రూపాయల విరాళాలిచ్చి బియ్యం పంపిణీతో అన్నదాతలుగా నిలిచిన వారు కొందరైతే.. వారందరికంటే భిన్నంగా ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని స్వస్థలాలకు వెళ్లలేక బిక్కు బిక్కుమంటూ ఉన్న కూలీల్ని సురక్షితంగా బస్సుల్లో తరలించి సేవ చేశారు సోనూ సూద్. అతడి అంతూ దరీ లేని ధాతృత్వానికి గొప్ప పేరొచ్చింది. మంచి మనసున్న రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిసాయి.

దేశమంతా తన మానవీయ కృషితో ప్రజల హృదయాలను గెలుచుకున్న తరువాత సోను సూద్ ఇటీవల తన కెరీర్ పైనా దృష్టి సారించారు. ఇప్పుడు టాలీవుడ్ పునరాగమనానికి సిద్ధంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఆచార్య`లో సోనుసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజా ఇంటర్వ్యూలో చిరుతో కలిసి పనిచేసినప్పటి తన అనుభవం గురించి సోను రకరకాల సంగతుల్ని వెల్లడించారు. చిరంజీవితో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ గొప్పగా ఉంటుందని పొగిడేసిన సోనూసూద్.. ‘గొప్ప ఆత్మ’ ఉన్న స్టార్ అని అభివర్ణించారు. ఆచార్య చిత్రం గురించి మాట్లాడుతూ సోను ఈ సినిమాలో వేరే కొత్త లుక్ లో సర్ ప్రైజ్ చేస్తానని కీలక సమాచారం లీక్ ఇచ్చేశాడు. నాగార్జున- మహేష్ – ఎన్టీఆర్ లాంటి స్టార్ల సినిమాల్లో సోనూ సూద్ విలనీ గురించి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి డిఫరెంట్ గా ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడో వేచి చూడాలి. దేవాదాయ శాఖ కుంభకోణం నేపథ్యంలో అతడి పాత్రను కొరటాల ఎలా మలిచారు? అన్నది వేచి చూడాలి.