నా వెనుక చాలా మంది ఉన్నారు : సోనూసూద్

0

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా కేంద్రం లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించడంతో వేలాది మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పని చేసే చోట ఉండలేక తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వాహనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వలస కార్మికులు ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే. అలాంటి సమయంలో నటుడు సోనూసూద్ మంచి మనసుతో ఏకంగా 20 వేల మంది వలస కార్మికులను రోడ్డు.. రైలు.. వాయు మార్గం ద్వారా వారి వారి సొంత ప్రాంతాలకు సొంత ఖర్చుతో పంపించారు. ఇందుకోసం ఆయన భారీగానే ఖర్చు చేశారు.

కేవలం వలస కార్మికులను వారి ఇళ్లకు చేర్చడంతో తన బాధ్యత ముగిసింది అనుకోకుండా అప్పటి నుండి ఎవరికి సాయం అవసరం అయినా కూడా తాను ముందు ఉంటున్నాడు. ఇప్పటి వరకు వందలాది మంది ఆయన సాయం పొందారు. రియల్ హీరో అంటూ పేరు దక్కించుకున్న సోనూసూద్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి మరియు తన వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్నకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నా కుటుంబం మొదటి నుండి వ్యాపారాల్లో ఉంది. నేను నటిస్తూ బాగానే సంపాదించాను. నా వద్ద ఉన్న డబ్బుతో ముందు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాను. ఆ తర్వాత నా వెనుక చాలా మంది నిలబడ్డారు. సాయం చేసేందుకు మేము సైతం మద్దతుగా ఉంటామంటూ ఆర్థికంగా సాంకేతికంగా ఇతర విషయాలతో ఎవరికి తోచిన విధంగా వారు నాకు మద్దతు ఇస్తున్నారు. వారందరికి కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నా అన్నాడు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల వెనుక చాలా మందే ఉన్నారంటూ సోనూసూద్ చెప్పడం ఆయన సింప్లిసిటీకి నిదర్శణంగా చెప్పుకోవచ్చు.