ప్లాన్- బితో సుజీత్ దూసుకెళ్లాల్సిన సమయమిదే

0

సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ప్రభాస్ ని ఎంతో స్టైలిష్ గా ఆవిష్కరించిన సుజీత్ కి వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ఆఫర్ అంటూ ప్రచారమైంది. లూసీఫర్ రీమేక్ కి సుజీత్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని చిరుని అల్ట్రా స్టైలిష్ గా ఆవిష్కరించే అవకాశం అదృష్టం యువదర్శకుడిని వరించాయని ప్రచారమైంది.

కానీ ఇంతలోనే ఈ ప్రాజెక్టులోకి మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ రంగ ప్రవేశం చేయడంతో సుజీత్ వైదొలగారని కూడా ప్రచారమైపోయింది. అయితే అది నిజమా కాదా? అన్నదానికి మెగా కాంపౌండ్ నుంచి కానీ సుజీత్ నుంచి కానీ ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. సుజీత్ వినిపించిన రీమోడల్ స్క్రిప్ట్ చిరుకి అంతగా నచ్చకపోవడంతో వినాయక్ ఎంట్రీ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. ఆయన పలువరు సీనియర్ రైటర్లను కలుపుకుని ఈ మూవీకి స్క్రిప్టును రెడీ చేస్తున్నారట.

అయితే సుజీత్ ప్రతిభ గురించి ఎవరూ శంకించడం లేదు. అతడికి ఇది అరుదైన అవకాశమే. కానీ మెగాస్టార్ లాంటి అగ్ర హీరోతో ఇంత వేగంగా అవకాశం పొందడం సరికాదనే విశ్లేషణ మరో కోణంలో సాగుతోంది. ప్రస్తుతానికి అతడు తన ఏజ్ ప్రతిభకు తగ్గట్టు యంగ్ హీరోలతో బ్లాక్ బస్టర్లు కొట్టి అగ్ర శ్రేణి హీరోల్ని టచ్ చేయడమే సరైనది అని సూచించే విశ్లేషకులు ఉన్నారు. అయితే సుజీత్ వెర్షన్ ఎలా ఉందో చూడాలి.